అడవిలో స్వేచ్ఛగా..

Zoo Animals Are Free Wandering With Lockdown - Sakshi

సాక్షి, జన్నారం(మంచిర్యాల) : కరోనా వైరస్‌ కట్టడిలో భాగంగా ప్రభుత్వాలు విధించిన లాక్‌డౌన్‌తో అడవిప్రాంతంలోని వన్యప్రాణులకు స్వేచ్ఛాయుత వాతావరం నెలకొంది. ప్రజలు లాక్‌డౌన్‌తో ఇళ్లకే పరిమితమయ్యా రు. రోడ్లపై రాకపోకలు నిలిచిపోగా అడవి ప్రాంతం ప్రశాంత వాతావరణం నెలకొంది. కవ్వాల్‌ టైగర్‌జోన్‌లోని జన్నారం అటవి డివిజన్‌లోని తాళ్లపేట్, జన్నారం, ఇందన్‌పల్లి అటవి రేంజ్‌లలోని అడవి ప్రాంతాల్లో అలజడి తగ్గడంతో వన్యప్రాణులు స్వచ్ఛాయుత వాతావరణంలో విహరిస్తున్నాయి. గతంలో దట్టమైన అడవిలో బిక్కుబిక్కుమంటూ ఉండే వన్యప్రాణులు కాస్త ఊరటగా బయటకు వస్తున్నాయి. అడవి వదులకపోయిన స్వచ్ఛగా తిరుగుతున్నా యి. ఈక్రమంలో‘సాక్షి’ గురువారం జన్నా రం అటవిడివిజన్‌లో అధికారులతో డుగా పర్యటించగా పలుచిత్రాలు కనిపించాయి. 

పక్షుల సందడి...
అడవిలో వన్యప్రాణులే కాకుండా రకరకాల పక్షలు సందడి చేస్తున్నాయి. ఉదయం అడవిలో అడుగుపెడితే పక్షుల కిలకిల రావాలు చెవులకు వింపుగా వినిపిస్తాయి. సుదూర ప్రాంతాల నుంచి రకరకాల పక్షులు కవ్వాల్‌లోని కుంటల వద్ద పర్యటిస్తున్నట్లు అటవిశాఖ అధికారులు చెబుతున్నారు. ఇండియన్‌ స్పాట్‌ బిల్‌డ్‌ డక్, యూరేషియన్‌ వైజన్‌ పక్షి, గార్గానీడక్, కామన్‌టీల్‌ డక్, ఆసియన్‌ ఓపెన్‌బిల్, రెడ్‌ నాపెడ్‌ ఐపిస్‌ పక్షి, గ్రేహెరన్‌ పక్షి, బ్లాక్‌ వింజ్‌డ్‌ స్టిల్ట్‌ పక్షి, కామన్‌ స్టాండ్‌ పైపర్‌ పక్షి, పీఏడ్‌ కింగ్‌ ఫిషర్, క్రేస్టెడ్‌ ట్రీస్వీఫ్ట్, బ్లాక్‌ నెక్‌డ్, వుల్లి నెక్‌డ్‌ పక్షులు ఈ కవ్వాల్‌లో విహారిస్తున్నట్లు అధికారులు పేర్కొన్నారు.

రోడ్డును వదిలి అడవుల్లోకి...
ప్రతి రోజు అడవి సమీపంలో ప్రధాన రహదారిపై రోడ్డుకు ఇరువైపులా ఉంటూ వాహనదారులు వేసే పండ్లు, వేరుశనగా, మొక్కజొన్న కంకులు తదితర వాటిని కోతులు తింటూ ఉండేవి. అదే విధంగా ఇందన్‌పల్లి, చింతగూడ, పొనకల్‌ తదితర గ్రామాల్లో కోతులు అనేకంగా ఇబ్బందులు పెట్టేవి. లాక్‌డౌన్‌ కారణంగా వాహనాల రాకపోకలు నిలిచిపోవడంతో కోతులకు ఆహారం కరువైంది. దీంతో కోతులు ఊర్లను వదిలి అడవిబాట పట్టాయి. కోతులు ఒకసారి అడవి రుచి మరిగితే ఇక జనావాసాల్లోకి రావని, ఇది కొంత ఊరట నిచ్చే విషయమని అటవి అధికారులు చెబుతున్నారు.

బెల్లంపల్లి: బెల్లంపల్లి చుట్టుపక్కల మండలాల్లో తిరుగుతున్న పులి గ్రామీణులతోపాటు అటవీ శాఖ అధికారులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. సాధారణంగా పులి ఒక్కచోట ఉండదు. అలాంటిది ఐదురోజులుగా ఒకే ప్రాంతంలో ఉంటూ.. ప్రజల అలికిడి ఉన్నప్పటికీ అదరకుండా తిరుగుతుండడంతో ఇదే ప్రాంతంలో ఆవాసం ఏర్పాటు చేసుకుంటుందా..? లేదా మరో ప్రాంతానికి వెళ్లిపోతుందా అనేది అంతుచిక్కడం లేదు. చెర్లపల్లి శివారులో అడుగుపెట్టగానే ఓ గేదెను హతమార్చిన పులి రోజువారీ కదలికలు అటవీ అధికారులను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. సూర్యస్తమయం కాకముందే.. దర్జాగా తన స్థావరాన్ని వదిలి బయటకు వస్తోంది. దీంతో పులిని కాపాడుకునేందుకు అటవీ అధికారులు నానాయత్నాలు చేస్తున్నారు. ఆ ప్రాంతంలో పది సీసీ కెమెరాలు, నాలుగు బేస్‌క్యాంపులు ఏర్పాటు చేసి  పర్యవేక్షిస్తున్నారు. పగలు, రాత్రి తేడా లేకుండా గస్తీ కాస్తున్నారు. వేటగాళ్లు విద్యుత్‌ తీగలు అమర్చకుండా, అటువైపు జనసంచారం లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రైతులు పొలాల వద్దకు వెళ్లకుండా కట్టడి చేస్తున్నారు.

యవ్వన దశలో పులి..
మహారాష్ట్రలోని తడోబా ప్రాంతం నుంచి వచ్చిన ఈ మగపులి యవ్వన దశలో ఉన్నట్లు తెలుస్తోంది. దీని వయసు నాలుగేళ్ల వరకు ఉంటుందని అటవీశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. కండపుష్టి కలిగి.. బలిష్టంగా ఉన్న పులి కదలికలను సీసీ కెమెరాల్లో బంధిస్తున్న అధికారులు.. ఆడతోడు కోసం ఆరాటపడుతున్నట్లు అంచనావేస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో నాలుగు పులులు సంచరిస్తున్నాయి. బెల్లంపల్లి పులితో ఆ సంఖ్య ఐదుకు చేరిందని చెబుతున్నారు. వీటన్నింటిలోనూ ఈ పులి వయస్సే తక్కువని పేర్కొంటున్నారు. జోడుకోసం వెంపర్లాడుతున్న ఈ పులి కొద్దిరోజులపాటు ఇదే ప్రాంతంలో ఉంటుందా..? లేక తోడు వెదుక్కుంటూ మరో ప్రాంతానికి వెళ్తుందా.. తేలాల్సి ఉంది. 

బెంబేలెత్తిస్తున్న బెబ్బులి
తాండూర్‌: మండలంలో పులి హడలెత్తిస్తోంది. బుధవారం రాత్రి గోలేటి వన్‌ ఇంక్‌లైన్‌ గని హోటల్‌ వెనకాలలోని అటవీ ప్రాంతంలో, రెబ్బెన మండలం కైరిగూడ గ్రామానికి చెందిన కోటేష్‌కు చెందిన ఎద్దును హతమార్చింది. ఆ ప్రాంత ప్రజలు భయందోళనకు గురవుతున్నారు. గోలేటి వన్‌ ఇంక్‌లైన్‌ గని నుంచి బీపీఏ ఓసీ –2 మధ్యలో పులి సంచారం చేస్తున్నట్లు చూపరులు చెబుతుండగా, అర్ధరాత్రి అచ్చులాపూర్‌ గ్రామ శివారు ప్రాంతంలో పులి గాండ్రింపులు వినిపించినట్లు స్థానికులు పేర్కొంటున్నారు. రెండు పులులు తిరుగుతున్నాయా.? ఒకే పులినా అనేది అటవీ అధికారులు ఇంకా ఓ అభిప్రాయానికి రాలేకపోతున్నారు. 
 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top