అమరావతి భూకుంభకోణంపై ఏసీబీ కేసు నమోదు

ACB Registered Case Against Amaravati Lands About Insider Trading - Sakshi

సాక్షి, అమరావతి : అమరావతి రాజధాని భూకుంభకోణంపై మంగళవారం ఏసీబీ కేసు నమోదు చేసింది. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ ఆరోపణలపై ప్రాథమిక నివేదికల ఆధారంగా ఏసీబీ మరింత లోతుగా దర్యాప్తు చేపట్టనుంది. రాజధాని విషయం ముందే తెలుసుకుని ఎవరెవరు భూములు కొన్నారు అనే కోణంలో దర్యాప్తు జరుపుతుంది. రాజధాని ప్రకటనకు ముందే టీడీపీకి చెందిన పలువురు నేతలు, ప్రముఖులు దాదాపు 4,075 ఎకరాల కొనుగోలు చేశారు. అందులో 900 ఎకరాల అసైన్డ్‌ భూములను దళితుల నుంచి బలవంతంగా కొనుగోలు చేసినట్లు తేలింది.

కాగా ఈ భూములు కొన్నవారిలో తెల్లరేషన్‌కార్డు దారులుతో పాటు టీడీపీ నేతలు, సన్నిహితులు, బినామీలు భూములు కొన్నట్టు గుర్తించారు. అలాగే టీడీపీ నేతలకు వాటాలు ఉన్న కంపెనీలు కూడా భూములు కొనుగోలు చేశారని తెలిసింది. ఇన్‌సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడ్డ వారిలో పరిటాల సునీత, జీవీఎస్ ఆంజనేయులు, పయ్యావుల కేశవ్‌, లంకా దినకర్, ధూళిపాళ్ల నరేంద్ర, కంభంపాటి రామ్మోహన్‌, పుట్టా మహేష్‌తో పాటు పలువురు టీడీపీ నేతలు ఉన్నారు. (చదవండి : రాజధాని అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలి) 

సెప్టెంబర్‌ 3,2015న చంద్రబాబు రాజధాని ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. కాగా అంతకముందే జూన్ 1,2014 నుంచి డిసెంబర్ 31,2014 వరకు భూముల కొనుగోళ్లు జరిగాయని.. 1977 అసైన్డ్ భూముల చట్టం, 1989 ఎస్సీ, ఎస్టీ హక్కుల చట్టం ఉల్లంఘించారని నిర్ధారణ అయింది.  లంక, పోరంబోకు, ప్రభుత్వ భూముల రికార్డుల్లో భారీ అక్రమాల గుర్తింపు జరిగినట్లు తేలింది. లాండ్ పూలింగ్ స్కీమ్ కోసం రికార్డులు తారుమారు చేసినట్టు తెలుస్తుంది. 

నారా లోకేష్ బినామీ వేమూరి రవి కుటుంబం పేరుతో 62 ఎకరాల భూమి, మరో టీడీపీ నేత లింగమనేని రమేష్ భార్యా, బంధువుల పేరిట భూముల కొనుగోలు చేశారు. మాజీ మంత్రి నారాయణ బినామీల పేర్లతో 55 ఎకరాలు కొనుగోలు చేశారని.. అందులో సన్నిహితులు ఆవుల మునిశేఖర్, రాపూరు సాంబశివరావు, కొత్తపు వరుణ కుమార్, పొత్తూరి ప్రమీల పేర్లతో 55.27 ఎకరాలు కొనుగోలు చేశారు. మాజీ ఎమ్మెల్యే కొమ్మాల పాటి శ్రీధర్ బినామీ పేర్లతో 68.6 ఎకరాలు, మాజీ మంత్రి ప్రత్తిపాటి గుమ్మడి సురేష్ పేరుతో 38 ఎకరాలు, మరో మంత్రి రావెల కిషోర్‌బాబు మైత్రీ ఇన్ ఫ్రా పేరుతో 40 ఎకరాలు కొన్నట్లు తేలింది. 

టీడీపీ నేతల కోసం సీఆర్డీఏ పరిధినే మార్చిన బాబు ప్రభుత్వం
టీడీపీ నేతల కోసమే గతంలో చంద్రబాబు ప్రభుత్వం సీఆర్డీయే పరిధిని మార్చేసింది. బాలకృష్ణ వియ్యంకుడికి చెందిన విబిసి కెమికల్స్‌ సంస్థకు 498 ఎకరాల కేటాయింపులు జరిగినట్లు తేలింది. కాగా భూములు కేటాయించాక సీఆర్డీయే పరిధి మారుస్తూ బాబు ప్రభుత్వం జీవో జారీ చేసింది. వివిధ సంస్థలకు భూ కేటాయింపుల్లోనూ అక్రమాలు ఉన్నట్లు తేలిందని ఏసీబీ పేర్కొంది. కేంద్ర ప్రభుత్వ సంస్థలకో రేటు, ప్రైవేటు సంస్థలకు మరో రేటుగా నిర్ణయించారని.. 5 ప్రైవేటు సంస్థలకు 850 ఎకరాల భూమి కేటాయింపులోనూ అక్రమాలు జరిగినట్లు తేలింది. (చదవండి : దివీస్‌లో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌!)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top