పెట్రోల్, డీజిల్‌పై రోడ్‌ డెవలప్‌మెంట్‌ సెస్‌ 

AP Imposes Road Development Cess on Petrol and Diesel - Sakshi

లీటర్‌కు రూపాయి విధిస్తూ ఆర్డినెన్స్‌ 

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో విక్రయించే పెట్రోలు, డీజిల్‌ అమ్మకాలపై రహదారుల అభివృద్ధి సెస్‌ను విధిస్తూ రాష్ట్ర గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ ఆర్డినెన్స్‌ ఇచ్చారు. లీటర్‌ పెట్రోలు, డీజిల్‌పై రూపాయి సెస్‌ను విధిస్తూ ఏపీ వ్యాట్‌ చట్టం–2005కు సవరణ చేశారు. కోవిడ్‌ ఉపద్రవంతో రాష్ట్ర ఆదాయం గణనీయంగా పడిపోయిందని, లాక్‌డౌన్‌ కారణంగా ఏప్రిల్, మే, జూన్, జూలై నెలల్లో ఆర్థిక లావాదేవీలు పూర్తిగా స్తంభించినట్టు రాష్ట్ర రెవెన్యూ శాఖ (వాణిజ్య పన్నులు, ఎక్సైజ్‌) ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌ భార్గవ విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ప్రకటనలో ఇంకా ఏముందంటే.. 

► గతేడాది ఏప్రిల్‌ నెల ఆదాయం రూ.4,480 కోట్లుండగా, లాక్‌డౌన్‌తో ఈ ఏడాది రూ.1,323 కోట్లకే పరిమితమైంది.  
► కేంద్రం కూడా 2020–21 ఏడాదికి జీఎస్టీ పరిహారాన్ని కూడా చెల్లించడం లేదు.  
► కోవిడ్‌–19 కట్టడికి ఆరోగ్యరంగంపై అధికంగా వ్యయం చేయడంతో పాటు, కష్టకాలంలో ఉన్న ప్రజలను ఆదుకునేందుకు సంక్షేమ పథకాలను పెద్ద ఎత్తున చేపట్టడంతో రాబడి కంటే వ్యయం ఎక్కువైంది.  
► వీటిని పరిగణనలోకి తీసుకున్నాక రహదారుల అభివృద్ధి కోసం ప్రత్యేకంగా సెస్‌ విధించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.  
► దీని ద్వారా వచ్చే సుమారు రూ.500 కోట్లను ప్రత్యేకంగా రహదారుల అభివృద్ధి కోసం ఏపీ రోడ్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌కు 
బదలాయిస్తాం.    

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top