జేఈఈ మెయిన్స్‌కు కరోనా ఆంక్షలు

Corona restrictions on JEE Mains - Sakshi

ప్రతి అభ్యర్థీ పాటించాల్సిందే.. సెల్ఫ్‌ డిక్లరేషన్‌ ఇవ్వాల్సిందే..

పరీక్ష కేంద్రాల్లోకి వెళ్లే ముందు కొత్త మాస్క్‌లు, థర్మల్‌ స్క్రీనింగ్‌

వచ్చే నెల 1 నుంచి 6వ తేదీ వరకూ పరీక్షలు 

దేశవ్యాప్తంగా 8.58 లక్షలు, ఏపీ నుంచి 45 వేల వరకూ హాజరయ్యే అవకాశం

సాక్షి, అమరావతి: ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటీ), నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఎన్‌ఐటీ) తదితర జాతీయ విద్యాసంస్థల్లో ప్రవేశానికి సంబంధించిన జాయింట్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌ (జేఈఈ) మెయిన్స్‌ నిర్వహణకు జాతీయ పరీక్షల నిర్వహణ సంస్థ పలు జాగ్రత్తలు చేపడుతోంది. కోవిడ్‌–19 నేపథ్యంలో ప్రతి అభ్యర్థి నిర్ణీత నిబంధనలు పాటించడాన్ని తప్పనిసరి చేస్తూ ఆదేశాలిచ్చింది. ప్రతి అభ్యర్థికి జారీచేసిన అడ్మిట్‌ కార్డుతో పాటు, పరీక్షల సమయంలో అనుసరించాల్సిన విధివిధానాలపై సూచనలు అందించింది. దేశవ్యాప్తంగా సెప్టెంబర్‌ 1 నుంచి 6వ తేదీ వరకు ఆన్‌లైన్‌(కంప్యూటరాధారితంగా)లో జరిగే ఈ పరీక్షలకు 8,58,273 మంది హాజరుకానున్నారు. ఏపీ నుంచి 45 వేల మంది వరకూ పరీక్షలు రాయనున్నట్టు అంచనా.

పరీక్ష కేంద్రంలో అభ్యర్థులకు అందుబాటులో శానిటైజర్లు
– నిర్ణీత సమయంలోగా పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి. ఆలస్యంగా వస్తే అనుమతించరు.
– అడ్మిట్‌కార్డులోని బార్‌కోడ్‌ రీడర్‌లను ప్రవేశద్వారాల వద్ద ఉంచుతారు. రీడ్‌ చేసిన వెంటనే అభ్యర్థుల ల్యాబ్‌ నంబర్‌ను తెలియచేస్తుంది.
– గుంపులుగా కాకుండా భౌతిక దూరాన్ని పాటిస్తూ పరీక్ష కేంద్రాల్లోకి ప్రవేశించాలి.
– అభ్యర్థులకు పరీక్ష కేంద్రం వద్ద మాస్క్‌ ఇస్తారు. అప్పటి వరకూ ధరించిన మాస్క్‌ను తీసేసి కొత్త మాస్క్‌ ధరించాలి. 
– శారీరక ఉష్ణోగ్రతలను థర్మోగన్స్‌ ద్వారా పరీక్షించాక లోపలికి అనుమతిస్తారు. 
– పరీక్ష పూర్తయ్యాక ఇన్విజిలేటర్‌ చెప్పే వరకూ సీటు నుంచి లేవరాదు. 
– అడ్మిట్‌ కార్డుతో పాటు ప్రభుత్వం జారీచేసిన ఫొటో గుర్తింపు కార్డు తీసుకురావాలి. 
– ఎన్‌టీఏ వెబ్‌సైట్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసిన అడ్మిట్‌కార్డులోని కోవిడ్‌–19 సెల్ఫ్‌ డిక్లరేషన్‌ (అండర్‌టేకింగ్‌)లో వివరాలు నమోదు చేయాలి. 
– దానిపై ఫొటో అంటించి సంతకంతో పాటు ఎడమ చేతి బొటన వేలిముద్ర కూడా వేయాలి. 
– బీఆర్క్‌ అభ్యర్థులు డ్రాయింగ్‌ టెస్ట్‌ కోసం జామెంట్రీ బాక్స్‌ సెట్, పెన్సిల్స్, ఎరేజర్స్, కలర్‌ పెన్సిల్స్‌ లేదా క్రేయాన్స్‌ తెచ్చుకోవాలి. 
– డ్రాయింగ్‌ షీట్లో నీటి రంగు వినియోగానికి అభ్యర్థులకు అనుమతి లేదు.
– ఎలక్ట్రానిక్‌ పరికరాలు, మొబైల్, ఇతర నిషేధిత వస్తువులతో సహా వ్యక్తిగత వస్తువులను పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించరు.
– అటెండెన్స్‌ షీటులో అతికించేందుకు అదనపు పాస్‌పోర్టు ఫొటో తేవాలి.
– ప్రతి షిఫ్ట్‌ ప్రారంభమయ్యే ముందు సీటింగ్‌ ఏరియా కీబోర్డ్, మౌస్, వెబ్‌క్యామ్, డెస్క్, కుర్చీ, మానిటర్ని పూర్తిగా శుభ్రపరుస్తారు.
– ఇందుకోసం అభ్యర్థులకు శానిటైజర్లను అందుబాటులో ఉంచుతారు. 
– రఫ్‌ వర్క్‌ కోసం ప్రతి సీటు వద్ద ఏ4 సైజ్‌ తెల్లకాగితాలు ఐదు అందుబాటులో ఉంటాయి. కావాల్సి వస్తే అదనంగా ఇస్తారు. 
– అభ్యర్థులు తమ పేరు, రోల్‌ నంబర్‌ను వాటి పైభాగంలో రాయాలి. పరీక్ష గది నుంచి బయటకు వెళ్లేముందు నిర్ణీత డ్రాప్‌ బాక్స్‌లో వాటిని వేయాలి
– సరిగా నింపిన అడ్మిట్‌ కార్డును కూడా డ్రాప్‌ బాక్స్‌లో వేయాలి. 

ఏపీలో కేంద్రాలు
అనంతపురం, భీమవరం, చీరాల, చిత్తూరు,ఏలూరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమహేంద్రవరం, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖ, విజయనగరం, నర్సారావుపేట, ప్రొద్దుటూరు, సూరంపాలెం

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top