రాష్ట్రంలో కోవిడ్‌ కేసులు తగ్గుముఖం

Corona Virus Cases Reduced In AP Says Officials To CM YS Jagan - Sakshi

సీఎంకు వివరించిన వైద్య ఆరోగ్య శాఖ అధికారులు

రికవరీ రేటు 84.48 శాతం, మరణాల రేటు 0.86 శాతం

అందుబాటులో బెడ్లు, అన్ని వైద్య సేవలు  

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కోవిడ్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతోందని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి తెలిపారు. కోవిడ్‌–19 నివారణ చర్యలపై సీఎం శుక్రవారం తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో ప్రస్తుతం కోవిడ్‌ పరిస్థితిని, వైద్య సేవలు, సదుపాయాల వివరాలను అధికారులు సీఎంకు వివరించారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

► రాష్ట్రంలో కోవిడ్‌ పాజిటివ్‌ కేసుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది. రాష్ట్రంలో ఇప్పటి వరకు 48,84,371 కోవిడ్‌ పరీక్షలు నిర్వహించాం. 17వ తేదీన ఒక్క రోజే 75 వేల పరీక్షలు చేశాం. ప్రస్తుతం 94,453 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. పాజిటివిటీ రేటు 12.31 శాతం కాగా, రికవరీ రేటు 84.48 శాతంగా ఉంది. మరణాల రేటు కేవలం 0.86 శాతం మాత్రమే. 

బెడ్లు, రోగులు
► రాష్ట్రంలో ఆక్సిజన్‌ బెడ్లు 18,609 ఉండగా, వాటిలో 5,723 మంది రోగులు చికిత్స పొందుతున్నారు. ఆక్సిజన్‌ సదుపాయం లేని బెడ్లు 15,060 ఉండగా, వాటిలో 9,777 మంది రోగులు చికిత్స పొందుతున్నారు.  
► ఐసీయూ బెడ్లు 4,469 ఉండగా, వాటిలో 2,246 మంది చికిత్స పొందుతున్నారు. 2,522 వెంటిలేటర్లు అందుబాటులో ఉండగా, 178 మంది రోగులు వాటిపై చికిత్స పొందుతున్నారు.
► అన్ని కోవిడ్‌ ఆస్పత్రులలో 38,025 బెడ్లు అందుబాటులో ఉండగా, ఇప్పటి వరకు 36,232 బెడ్ల వినియోగం జరిగింది. 
► కోవిడ్‌ ఆస్పత్రులలో 17,924 మంది రోగులు, కోవిడ్‌ కేర్‌ సెంటర్ల (సీసీసీ)లో 15,625 మంది రోగులు చికిత్స పొందుతుండగా, హోం ఐసొలేషన్‌లో 60,905 మంది ఉన్నారు.
► కోవిడ్‌ చికిత్స కోసం అన్ని జిల్లాలలో పూర్తి సదుపాయాలు ఉన్నాయి. ఎలాంటి పరిస్థితిని అయినా ఎదుర్కొనేందుకు కలెక్టర్లు పూర్తి సన్నద్ధంగా ఉన్నారు.
► రాష్ట్ర వ్యాప్తంగా కోవిడ్‌ చికిత్స కోసం 268 ఆస్పత్రులను సిద్ధం చేయగా, వాటిలో 230 ఆస్పత్రులను ఇప్పటి వరకు వినియోగించాం.
సిబ్బంది, నియామకాలు, ప్రమాణాలు
► నర్సింగ్‌ ఆర్డర్లీస్‌ (మేల్, ఫిమేల్‌), శానిటేషన్‌ సిబ్బంది, డేటా ఎంట్రీ ఆపరేటర్లు, శిక్షణ నర్సులకు సంబంధించి అని జిల్లాలలో 20,415 పోస్టులకు అనుమతి ఇవ్వగా, ఇప్పటి వరకు 12,014 మంది నియామకం జరిగింది.
► ప్రజలకు అత్యంత మెరుగైన సేవలందించేలా 104, 108, 14410 కాల్‌ సెంటర్లు పని చేస్తున్నాయి. ఆస్పత్రుల రేటింగ్‌ కోసం ప్రత్యేక మెథడాలజీ అనుసరిస్తున్నాం. ఐసీయూ బెడ్లు, వైద్యం, ఆహారం, శానిటేషన్‌ వంటి అన్ని అంశాల్లో ప్రమాణాలపై దృష్టి పెట్టాం. 
► ఎన్‌95 మాస్కులు 5,21,350, పీపీఈ కిట్లు 7,61,097 అందుబాటులో ఉన్నాయి. ప్లాస్మా థెరపీకి సంబంధించి, 9 జిల్లాలలోని ప్రధాన ఆస్పత్రులలో 308 కాన్వలసెంట్‌ ప్లాస్మా సేకరించగా, ఇప్పటి వరకు 265 వినియోగించారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top