టెక్‌ షేర్లు వీక్‌- యూఎస్‌ వెనకడుగు

Tech shares down- US Market weaken third week - Sakshi

యాపిల్‌, మైక్రోసాఫ్ట్‌, గూగుల్‌, ఫేస్‌బుక్‌, నెట్‌ఫ్లిక్స్‌ వీక్‌

ఇటీవల గరిష్టం నుంచి యాపిల్‌ 23 శాతం డౌన్‌ 

ఈ వారం 5 శాతంపైగా క్షీణించిన అమెజాన్‌, ఫేస్‌బుక్‌

డోజోన్స్‌ 245- నాస్‌డాక్‌ 117 పాయింట్లు డౌన్‌

వరుసగా మూడో వారం ఎస్‌అండ్‌పీ, నాస్‌డాక్‌ నష్టాలలో

టెక్నాలజీ కౌంటర్లలో అమ్మకాలు కొనసాగుతుండటంతో వరుసగా మూడో రోజు యూఎస్‌ మార్కెట్లు నష్టపోయాయి. శుక్రవారం డోజోన్స్‌ 245 పాయింట్లు(0.9%) నీరసించి 27,657 వద్ద నిలిచింది. ఎస్‌అండ్‌పీ 38 పాయింట్లు(1.1%) క్షీణించి 3,319 వద్ద ముగిసింది. ఇక నాస్‌డాక్‌ మరింత అధికంగా 117 పాయింట్ల(1.1%) నష్టంతో 10,793 వద్ద స్థిరపడింది. వెరసి వరుసగా మూడో వారం ఎస్‌అండ్‌పీ, నాస్‌డాక్‌ వెనకడుగుతో నిలిచినట్లయ్యింది. ఇంతక్రితం 2019 సెప్టెంబర్‌లో మాత్రమే ఈ స్థాయిలో వెనకడుగు వేశాయి. కోవిడ్‌-19 నేపథ్యంలో గతంలో ప్రకటించిన అతిభారీ ప్యాకేజీ 2 ట్రిలియన్‌ డాలర్లకు కొనసాగింపుగా ప్రజలకు మరింత ఆర్థిక సహాయాన్ని అందించాలన్న ప్రతిపాదనపై రిపబ్లికన్లు, డెమక్రాట్ల మధ్య సయోధ్య కుదరకపోవడంతో సెంటిమెంటు బలహీనపడినట్లు నిపుణులు పేర్కొన్నారు. తాజా పాలసీ సమీక్షలో భాగంగా ఫెడరల్‌ రిజర్వ్‌ కొత్త ప్యాకేజీపై స్పందించకపోవడం దీనికి జత కలిసినట్లు అభిప్రాయపడ్డారు.

బేర్‌ ట్రెండ్‌?
గత కొంత కాలంగా మార్కెట్లకు జోష్‌నిస్తున్న టెక్నాలజీ కౌంటర్లలో కొద్ది రోజులుగా అమ్మకాలు నమోదవుతున్నాయి. దీంతో ఈ నెల మొదటి నుంచీ మార్కెట్లు నేలచూపులతో కదులుతున్నాయి. మార్కెట్లకు బలాన్నిస్తున్న FAAMNG స్టాక్స్‌లో ఈ వారం అమెజాన్‌, ఫేస్‌బుక్‌ 5 శాతంకంటే అధికంగా బలహీనపడ్డాయి. ఈ నెలలో చూస్తే ఫేస్‌బుక్‌, అమెజాన్‌, అల్ఫాబెట్‌, మైక్రోసాఫ్ట్‌, నెట్‌ఫ్లిక్స్‌ 10 శాతం స్థాయిలో డీలాపడ్డాయి. యాపిల్‌ మరింత అధికంగా 17 శాతం క్షీణించింది. ఇటీవల సాధించిన గరిష్టం నుంచి చూస్తే యాపిల్‌ 23 శాతం పతనమైంది. ఫలితంగా కంపెనీ మార్కెట్‌ విలువలో 500 బిలియన్‌ డాలర్లు ఆవిరైంది.

మళ్లీ డౌన్‌..
ఫాంగ్‌ స్టాక్స్‌గా పిలిచే న్యూఏజ్‌ టెక్‌ కౌంటర్లలో వారాంతాన యాపిల్‌ 3.2 శాతం పతనమైంది. ఇతర కౌంటర్లలో అల్ఫాబెట్‌ 2.4 శాతం, అమెజాన్‌ 1.8 శాతం, మైక్రోసాఫ్ట్‌ 1.2 శాతం, ఫేస్‌బుక్‌ 1 శాతం చొప్పున డీలాపడ్డాయి. మోడర్నా ఇంక్‌ 3 శాతం, ఆస్ట్రాజెనెకా 1 శాతం చొప్పున బలపడగా.. ఫైజర్‌ 0.5 శాతం నీరసించింది. జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ 1.4 శాతం పుంజుకోగా.. షెవ్రాన్‌ 0.75 శాతం బలహీనపడింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top