డబ్బు కోసం మేనత్త హత్య

Aunty Assassinated By Son In Law Due To Money In Warangal - Sakshi

సాక్షి, వరంగల్‌: మత్తు పదార్థాలు, జల్సాలకు అలవాటు పడి వాటికి అవసరమైన డబ్బు కోసం ఆశ్రయం కల్పించిన మేనత్తను హత్య చేసిన నిందితుడితో పాటు ఆయనకు సహకరించిన మరో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు. దీంతో హన్మకొండ టైలర్‌ స్ట్రీట్‌లో ఇటీవల జరిగిన వివాహిత హత్య కేసులో మిస్టరీ వీడినట్లయింది. ఈ మేరకు హన్మకొండలోని పోలీసు కమిషనరేట్‌ కార్యాలయంలో నిందితుల వివరాలను సీపీ ప్రమోద్‌కుమార్‌ వెల్లడించారు.

భర్త మరణంతో కూరగాయల వ్యాపారం
హన్మకొండ టైలర్‌ స్ట్రీట్‌కు చెందిన దోర్నం శారద(38) భర్త మరణించడంతో కుమారుడు అఖిల్, కుమార్తెతో ఉంటూ కూరగాయల వ్యాపారం చేస్తోంది. కుమార్తె హైదరబాద్‌లో ఇంజనీరింగ్‌ చదువుతుండగా, అఖిల్‌ తల్లి దగ్గర ఉంటూ ఇంటర్మీడియట్‌ చదువుతున్నాడు. ఈ క్రమంలో వరంగల్‌ ఎస్‌ఆర్‌ఎఆర్‌ తోటకు చెందిన అడెపు ఆకాశ్‌బాబు గంజాయి సేవిస్తూ మత్తు› పదార్థాలకు బానిస కావడంతో తల్లిదండ్రులు ఇంట్లో నుంచి గెంటి వేశారు. ఈ క్రమంలో మృతురాలు శారద తన అన్న కుమారుడైన ఆకాశ్‌బాబుకు తన ఇంట్లో సుమారు 15 రోజుల పాటు ఆశ్రయం కల్పించింది. ఈ సందర్భంగా ఆమె కూరగాయల వ్యాపారం ద్వారా వచ్చే డబ్బుతో పాటు కూతురు పెండ్లి కోసం పొదుపు చేస్తున్న డబ్బు, బంగారాన్ని బీరువాలో పెట్టడాన్ని గమనించాడు.

ఇదే సమయంలో చెడు వ్యసనాలకు డబ్బు దొరకపోవడంతో ఈ నెల 3న తెల్లవారుజామున ఉదయం 3 గంటలకు శారద ఇంట్లోకి చొరబడ్డాడు. శారదపై బండ రాయి వేసి హత్య చేసిన ఆయన పక్కనే నిద్రిస్తున్న ఆమె కుమారుడు అఖిల్‌పై కూడా హత్యాయత్నం చేశాడు. ఆ తర్వాత బీరువాలోని డబ్బులో కొంత, బంగారం తీసుకుని దీనిని ప్రమాదంగా చితత్రీకరించేందుకు కొన్ని డబ్బులు ఉంచి వారిపై బీరువా పడవేసి పరారయ్యాడు. అయితే, కేసులో ఎలాంటి క్లూ లభించకపోవడంతో సెంట్రల్‌ జోన్‌ ఇన్‌చార్జ్‌ డీసీపీ కె.పుష్ప, హన్మకొండ ఏసీపీ జితేందర్‌రెడ్డి ఆధ్వర్యాన మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.
నిందితుడికి ఇద్దరి సహకారం
హత్య అనంతరం ప్రధాన నిందితుడు ఆకాశ్‌బాబుకు ఓ బాల నేరస్తుడితో పాటు యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లికి చెందిన మేకల మచ్చేందర్‌ సహకరించారు. ఈ మేరకు చోరీ చేసిన సొత్తులో నుంచి బాల నేరస్తుడికి రూ.51 వేలు, మచ్చేందర్‌కు రూ1.5 లక్షలు ఇవ్వగా వారు ఆశ్రయం కల్పించారు. కేసు విచారణలో భాగంగా అధునాతక సాంకేతిక పరిజ్ఞానంతో పాటు సీసీ కెమెరాల పుటేజీ ఆధారంగా నిందితులను  బుధవారం కాకతీయ యూనివర్సిటీ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో అరెస్టు చేశారు.

ఈ సందర్భంగా ఆకాశ్‌బాబు నుంచి రూ.69,900తో పాటు బంగారు ఆభరణాలతో పాటు మిగతా వారి నుంచి కూడా కలిపి రూ.2.7 లక్షలు, మూడు సెల్‌ఫోన్లు స్వాదీనం చేసుకున్నారు. కాగా, మిల్స్‌కాలనీ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో సీసీ కెమెరాలు పగులగొట్టిన ఘటనలో ఆకాశ్‌పై గతంలో కేసు నమోదైంది. ఈ మేరకు కేసును చేధించడంలో ప్రతిభ కనపరిచిన సెంట్రల్‌ జోన్‌ ఇన్‌చార్జ్‌ డీసీపీ పుష్ప, హన్మకొండ ఏసీపీ జితేందర్‌రెడ్డి, సుబేదారి, సీసీఎస్‌ ఇన్‌స్పెక్టర్లు అజయ్‌కుమార్, శ్రీనివాస్‌రావు, హన్మకొండ, సుబేదారి సబ్‌ ఇన్‌స్పెక్టర్లు శ్రీనివాస్‌యాదవ్, వేణుగోపాల్‌తో పాటు సిబ్బంది సీపీ ప్రమోద్‌కుమార్‌ అభినందించారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top