ప్రభుత్వ ఉద్యోగాలిప్పిస్తామని టోకరా 

Fraud Gang Arrested Over Giving Government Jobs Mahabubnagar - Sakshi

సాక్షి, పెబ్బేరు (కొత్తకోట): ప్రభుత్వ ఉద్యోగాలు ఇప్పిస్తామని యువతను నమ్మించి రూ. కోట్లు వసూలు చేసిన చిన్నంబావి మండలం అమ్మాయిపల్లికి చెందిన మండ్ల వసంత, వీపనగండ్ల మండలం కల్వరాలకు చెందిన చింతమోని శాంతయ్య, వీపనగండ్లకు చెందిన డ్రైవర్‌ అశోక్‌రెడ్డిని మంగళవారం పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌ ఆవరణలో ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో వనపర్తి డీఎస్పీ కిరణ్‌కుమార్, కొత్తకోట సీఐ మల్లికార్డున్‌రెడ్డి పూర్తి వివరాలు వెల్లడించారు.

తాను రైల్వేశాఖలో టీసీ (టికెట్‌ కలెక్టర్‌)గా ఉద్యోగం చేస్తున్నానని..రైల్వేశాఖలో భారీగా ఉద్యోగాలు పడ్డాయని, చాలామంది తెలుసు, ఉద్యోగాలు ఇప్పిస్తామనని చెప్పి వసంత చాలామంది యువత నుంచి డబ్బులు వసూలు చేసేది. 2014లో ఆమెకు శాంతయ్య పరిచయం అయ్యాడు. పోలీస్‌శాఖలో తనకు ఉన్నతాధికారులు బాగా తెలుసని ఎస్‌ఐ ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి రూ.12 లక్షలు వసూలు చేసింది. 

నకిలీ అర్డర్‌ కాపీ అందజేసి..
కొన్నిరోజులు గడిచాక తన ఉద్యోగం ఏమైందని అడుగగా ఎస్‌ఐ ఉద్యోగం కాదు నీకు సీఐగా పదోన్నతి వచ్చిందని చెప్పి నకిలీ ఆర్డర్‌ కాపీని అందజేసి పోలీస్‌ యూనిఫాం కూడా ఇచ్చింది. అప్పటికే అతడు బంధువులు మరికొందరికి ఉద్యోగాలు కావాలని వారి వద్ద డబ్బులు వసూలు చేసి తెచ్చి ఇచ్చాడు. అనంతరం ఆమె చెబుతున్న మాటలు నమ్మక.. తాను మోసపోయానని గుర్తించి ఆమెతో కలిసి మోసాలు చేయడం ప్రారంభించాడు. వీరు తరచూ వీపనగండ్ల అశోక్‌రెడ్డి కారు తీసుకొని హైదరాబాద్, బెంగళూరు, ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాలకు వెళ్లేవారు. రోజూ వీరు మాట్లాడుతున్న మాటలు గమనించి అతను కూడా కలిసిపోయాడు. అందరూ కలిసి పరిసర మండలాల్లోనే కాకుండా ఇతర ప్రాంతాల వారిని ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మోసం చేస్తూ వచ్చారు.

రైల్వేలో టికెట్‌ కలెక్టర్, వివిధ రకాల ఉద్యోగాలు ఇప్పిస్తామని బత్తుల రాజేశ్‌ నుంచి రూ.6 లక్షలు, చటమోని అనిల్‌ దగ్గర రూ.4 లక్షలు, మిద్దె శ్రీనివాసులు నుంచి రూ.2 లక్షలు, కొల్లాపూర్‌కు చెందిన సుధాకర్‌ దగ్గర రూ.2.50 లక్షలు వసూలు చేశారు. అలాగే గద్వాల జిల్లా ఇటిక్యాల మండలం పుట్టాన్‌దొడ్డికి చెందిన బొమ్మిరెడ్డి విమలకు పోలీస్‌శాఖలో ఉద్యోగం ఇప్పిస్తామని రూ.5 లక్షలు బ్యారం కుదుర్చుకొని మొదటగా రూ.3 లక్షలు అడ్వాన్స్‌ తీసుకున్నారు. మిగతా వారుంటే చెప్పండి చూద్దామని నమ్మించటంతో వారి బంధువులతో నుంచి రూ.40 లక్షలు వసూలు చేసి ఇచ్చింది. పెబ్బేరులో విజయకుమారితో పాటు వారి బంధువుల నుంచి రూ.40 లక్షలు వసూలు చేశారు. 

పోలీస్‌ యూనిఫాంతో..
ఉద్యోగం ఏమైంది ఇంకా ఎన్నిరోజులు అన్ని అడిగితే శాంతయ్య పోలీస్‌ యూనిఫాంతో కారులో వారి ఇంటి వద్దకు వెళ్లి వసంత మేడం ఇప్పించిన ఎస్‌ఐ ఉద్యోగమే ఇప్పుడు నాకు  సీఐగా ప్రమోషన్‌ వచ్చిందని చెప్పడం ప్రారంభించారు. ఇలా మొత్తం రూ.1.62 కోట్లు వసూలు చేశారు. మరికొందరికి ఉద్యోగాల పేరిట నకిలీ ఆర్డర్‌ కాపీలు అందించి రెండునెలల పాటు వారి అకౌంట్లలో నెలకు రూ.14 వేల చొప్పున వేతనాన్ని కూడా వేశారు. వేతనం సరే ఉద్యోగాలు ఏమయ్యాయని అని అడుగగా వారు రోజురోజు పొంతన లేని సమాధానాలు చెప్పటంతో కొందరు బాధితులు వీపనగండ్ల, పెబ్బేరు పోలీస్‌ స్టేషన్లలో ఫిర్యాదు చేయగా కేసులు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. వసంత, శాంతయ్య, అశోక్‌రెడ్డిని అదుపులోకి తీసుకొన్ని వివరాలు సేకరించారు. ఇప్పటి వరకు 28 మంది బాధితులు ముందుకొచ్చారు. ఇందులో రూ.6 లక్షల నగదు, 6 తులాల బంగారం, ఒక ల్యాప్‌టాప్, ఒక కారు స్వాధీనం చేసుకొని వారిని రిమాండ్‌కు తరలించారు. దర్యాప్తు చేపట్టిన పెబ్బేరు ఎస్‌ఐ రాఘవేందర్‌రెడ్డి,  ఏఎస్‌ఐ జయన్న, కానిస్టేబుళ్లు స్వామి, భీమయ్యను డీఎస్పీ అభినందించారు.  

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top