ఇష్టం లేని పెళ్లి చేశారని..

Husband Assassinated Wife And Commits Suicide Hyderabad - Sakshi

భర్త ఘాతుకం భార్య హత్య 

ఫినాయిల్‌ తాగి, చేతులు కోసుకుని ఆత్మహత్యాయత్నం

మియాపూర్‌: ఇష్టంలేని పెళ్లి చేశారని ఓ యువకుడు భార్య గొంతు నులిమి హత్య చేయడమేగాక తానూ ఫినాయిల్‌ తాగి, బ్లేడుతో చేతులు కోసుకొని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన మియాపూర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో మంగళవారం వెలుగులోకి వచ్చింది. ఇన్‌స్పెక్టర్‌  వెంకటేష్‌ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. అనంతపురం జిల్లా, పాతకొచ్చేరు గ్రామానికి చెందిన రామదాస్, రంగమ్మ కుమారుడు మొట్టే యాగంటయ్య అలియస్‌ యోగి( 25 ) 10వ తరగతి వరకు చదువుకున్నాడు. తన బావ ఆదినారాయణతో కలిసి ఎలక్ట్రిషియన్‌గా పనిచేస్తూ మియాపూర్‌ గోకుల్‌ ప్లాట్స్‌లో ఉండేవాడు. ఈ క్రమంలో అతడి తల్లిదండ్రులు యోగికి అదే గ్రామంలో ఉంటున్న తన సోదరి రమణమ్మ కుమార్తె అరుణ అలియస్‌ గాయత్రి (22)తో గత మే 13న బలవంతంగా పెళ్లి చేశారు. పెళ్లి సమయంలో రూ. 2 లక్షల నగదు, 10 తులాల బంగారం కట్న కానుకలుగా ఇచ్చారు. (మైనర్‌ వివాహితపై సామూహిక లైంగిక దాడి )

పెళ్లి అయిన తర్వాత నెల రోజుల పాటు అక్కడే  ఉన్నారు. అక్కడ పని దొరక్క పోవడంతో జూన్‌ నెలలో  మియాపూర్‌ వచ్చి గోకుల్‌ప్లాట్స్‌లో ఒక గదిని అద్దెకు తీసుకొని ఉంటున్నారు. కాగా యోగి గతంలో ఓ యువతిని ప్రేమించాడు. దీంతో అతను తన భార్య అరుణణు అందంగా లేవని వేధిస్తూ తరచు ఆమెతో గొడవ పడేవాడు. సోమవారం రాత్రి అరుణ నిద్రిస్తుండగా ఆమె గొంతు నొక్కి హత్య చేశాడు. అనంతరం అతను బాత్‌రూమ్‌లో ఉన్న ఫినాయిల్‌ తాగి, చేతులను బ్లేడ్‌తో చేతులు కోసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. మంగళవారం ఉదయం రక్తపు మడుగులో ఉన్న యోగిని, అరుణను గుర్తించిన పక్కింటి వారు మియాపూర్‌ పోలీసుకు సమాచారం అందించారు. మియాపూర్‌ ఏసీపీ కృష్ణప్రసాద్, ఇన్‌స్పెక్టర్‌ వెంకటేష్‌  సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. అపస్మారక స్థితిలో పడి ఉన్న యోగిని ఆస్పత్రికి తరలించారు. అరుణ మృత దేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top