దారి దోపిడీ ముఠా అరెస్టు 

Police Have Arrested Three People For Robbery - Sakshi

తణుకు (పశ్చిమగోదావరి): జాతీయ రహదారిపై దారి దోపిడీలకు పాల్పడుతున్న ముగ్గురిని శనివారం పోలీసులు అరెస్టు చేశారు. మోటారు సైకిళ్లపై ఒంటరిగా వెళ్లే వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని వారిని ఆపి నగదు, సెల్‌ఫోన్లు దొంగిలించడం వీరి వృత్తి.. శనివారం తణుకు సర్కిల్‌ పోలీసు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కొవ్వూరు డీఎస్పీ కె.రాజేశ్వరరెడ్డి వివరాలు వెల్లడించారు. తణుకు సర్కిల్‌ పరిధిలోని పెరవలి, తణుకు పట్టణ పోలీసు స్టేషన్‌ పరిధిలోని హైవేపై గత రెండ్రోజుల వ్యవధిలోనే రెండు దారి దోపిడీలు జరిగినట్లు ఫిర్యాదులు రావడంతో.. ఇన్‌ఛార్జి సీఐ ఆకుల రఘు ఆధ్వర్యంలో నిఘా ఉంచారు. హైవేపై రాత్రి సమయాల్లో ఒంటరిగా వెళుతున్న వ్యక్తులను లక్ష్యంగా చేసుకుని వారిని వెంబడిస్తూ అనువైన ప్రదేశంలో ఆపి గొడవ పెట్టుకుని.. వారిని గాయపరిచి సెల్‌ఫోన్లు, నగదు లాక్కెళుతున్నట్లు గుర్తించారు. గుర్తు తెలియని ముగ్గురు వ్యక్తులు పల్సర్‌ మోటారు సైకిల్‌పై తిరుగుతూ దోపిడీలు చేస్తున్నట్లు చెప్పారు.

దీంతో స్థానిక పెరవలి వై జంక్షన్‌ వద్ద శుక్రవారం పోలీసులు నిఘా ఉంచి వాహనాల తనిఖీ చేపట్టారు. పల్సర్‌ వాహనంపై అనుమానాస్పదంగా వెళ్తున్న ముగ్గురు వ్యక్తులను ఆపి విచారించగా వారి నుంచి సరైన సమాధానం రాకపోవడంతో వారిని విచారించారు. గత కొద్దిరోజులగా దారి దోపిడీలకు పాల్పడుతున్నట్లుగా నిర్ధారించారు. తణుకు హౌసింగ్‌ బోర్డు కాలనీలో ఉంటున్న గంటా శ్రీను అలియాస్‌ గరగ శ్రీను, బరువు లోవరాజు, కోటిపల్లి ప్రవీణ్‌కుమార్‌ అలియాస్‌ నానిలను అరెస్టు చేసి వారిపై కేసు నమోదు చేశారు. వారి నుంచి రూ. 1500 నగదు, రెండు సెల్‌ఫోన్లు, నేరాలకు ఉపయోగిస్తున్న మోటారుసైకిల్‌ స్వా«దీనం చేసుకున్నారు. కేసును త్వరితగతిన ఛేదించడానికి సహకరించిన ఇన్‌ఛార్జి సీఐ ఆకుల రఘు, పట్టణ ఎస్సై కె.రామారావు, పెరవలి ఎస్సై ఎం.సూర్యభగవాన్, ఏఎస్సై ఐ.శ్రీధర్, హెడ్‌కానిస్టేబుళ్లు శ్రీనివాసరెడ్డి, సత్యనారాయణ, సాంబయ్యలను డీఎస్పీ రాజేశ్వరరెడ్డి అభినందించారు.   

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top