ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్య

మార్కాపురం(ప్రకాశం జిల్లా): వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడన్న కారణంతో ప్రియుడితో కలిసి భర్తను భార్య హతమార్చిన సంఘటన శుక్రవారం అర్ధరాత్రి మార్కాపురం పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎస్టేట్‌లో జరిగింది. మార్కాపురం సీఐ కేవీ రాఘవేంద్ర శనివారం తెలిపిన వివరాల ప్రకారం పూలసుబ్బయ్య కాలనీలో నివాసం ఉండే ఎల్లంగారి వెంకటేశ్వర్లు అలియాస్ వెంకటేష్ (32)కు ఆరేళ్ల కిందట అశ్వనితో వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇటీవల అశ్వని ఎస్టేట్‌లో నివాసం ఉండే టి.దేవరాజ్‌తో సన్నిహితంగా ఉంటోంది. ఈ విషయమై అశ్వనికి, భర్త వెంకటేష్‌కు మధ్య గొడవలు జరిగాయి. భార్యను పద్ధతి మార్చుకోవాలని వెంకటేష్ హెచ్చరించాడు. నెల రోజుల క్రితం అశ్వని, దేవరాజ్‌లు ఇంటి నుంచి వెళ్లిపోయారు.
తన భార్య కనిపించడం లేదని వెంకటేష్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వారం తరువాత వారిద్దరూ తిరిగి వచ్చారు. ఇలా ఉండగా శుక్రవారం కూడా వీరి మధ్య గొడవ జరిగింది. అశ్వని, వెంకటేష్ కలిసి దేవరాజ్ ఇంటికి వెళ్లారు. ముగ్గురి మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది. అశ్వని, దేవరాజ్‌లు కలిసి బలమైన వస్తువుతో వెంకటేష్‌పై దాడి చేయటంతో మృతి చెందాడు. వెంటనే వారిద్దరూ పరారయ్యారు. ఈ సంఘటనపై మృతుని బావ జయరాములు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ రాఘవేంద్ర తెలిపారు. నిందితులను త్వరలోనే పట్టుకుంటామని చెప్పారు. సంఘటన స్థలాన్ని సీఐతో పాటు ఎస్సై సందర్శించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వైద్యశాలకు తరలించారు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి