విజయవాడలో విషాదం

Fire Accident In Corona Center At Vijayawada - Sakshi

విజయవాడ స్వర్ణ ప్యాలెస్‌ హోటల్‌లో ఆదివారం వేకువజామున జరిగిన భారీ అగ్ని ప్రమాదంలో పదిమంది ప్రాణాలు కోల్పోవడం, మరో 18మంది గాయాలపాలు కావడం అత్యంత విషాదకరం. కొందరు నిద్రలోనే పొగతో ఊపిరాడక మరణిస్తే, మరికొందరు ప్రాణాలు కాపాడుకునే ప్రయ త్నంలో చనిపోయారు. సకాలంలో అగ్నిమాపక సిబ్బంది చేరుకుని చర్యలు తీసుకోవడంతో మరికొం దరు సురక్షితంగా బయటపడగలిగారు.  కోవిడ్‌–19 వ్యాధిగ్రస్తులకు చికిత్స అందించడం కోసం ఆ హోటల్‌ను స్థానికంగా వుండే రమేశ్‌ ఆస్పత్రి లీజుకు తీసుకుంది. కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందుతాయని, మంచి సదుపాయాలుంటాయని అనేకులు అనుకుంటారు. సాధారణ రోగులతోపాటు ఉండటం, చికిత్స పొందటం కష్టమని, స్తోమత వుంది గనుక కార్పొరేట్‌ ఆసుపత్రు లకు పోదామని భావిస్తారు. ముఖ్యంగా కోవిడ్‌ వంటి వ్యాధి బారినపడినవారికి కార్పొరేట్‌ ఆసు పత్రుల్లో రాత్రింబగళ్లు సేవలు అందుతాయనుకుంటారు. హోం క్వారంటైన్‌ సరిపోతుందని చెప్పినా ఈ ఉద్దేశంతోనే స్వర్ణ ప్యాలెస్‌లోని కోవిడ్‌ కేంద్రంలో చేరినవారున్నారు.  కానీ సేవలు, సదుపాయాల మాటేమోగానీ...చాలా కార్పొరేట్‌ ఆసుపత్రుల్లో నిలువుదోపిడీ రివాజైంది. అనేకచోట్ల నిర్లక్ష్యమే రాజ్యమేలుతోంది.

విజయవాడ విషాద ఉదంతం దీన్ని మరోసారి నిరూపించింది. రమేశ్‌ ఆసుపత్రి కొత్తగా ఈ రంగంలోకి రాలేదు. కానీ ప్రమాదం జరిగాక ఆ ఆసుపత్రి ఇస్తున్న సంజాయిషీ ఆశ్చర్యం కలిగిస్తోంది. ప్రభుత్వ అనుమతితోనే హోటల్‌ను లీజుకు తీసుకుని కోవిడ్‌ చికిత్సా కేంద్రంగా మార్చిందట. వైద్య సేవలు అందించడమే తప్ప, ఆ చికిత్సా కేంద్రం నిర్వహణతో సంబంధం లేదట! అసలు అక్కడ జరిగిందేమిటో, తమవైపుగా ఎలాంటి లోటుపాట్లున్నాయో సమీక్షించకుండానే ఇలా ఒక ప్రకటన ఇచ్చి చేతులు దులుపుకున్న తీరు ఆ ఆసుపత్రి యాజమాన్య నిర్లక్ష్య వైఖరిని పట్టిచూపు తుంది. అసలు లీజుకిచ్చేవారూ, తీసుకునేవారూ భవంతి ఏ స్థితిలో వుందో చూసుకోవాల్సిన అవ సరం వుండదా? భవనంలో ఎక్కడెక్కడ ఏమేం మార్పులు చేయాల్సివుందో హోటల్‌ యాజమాన్యం చెప్పాలి. ఆసుపత్రి యాజమాన్యం కూడా ఎక్కడెక్కడ లోటుపాట్లున్నాయో క్షుణ్ణంగా తనిఖీ చేసు కోవాలి. ముఖ్యంగా ఏళ్ల తరబడి వాడుతున్న విద్యుత్‌ కేబుళ్ల నాణ్యత గురించి నిపుణులతో చర్చించాలి. తగిన మార్పులు చేయాలి. వ్యాధిగ్రస్తుల నుంచి లక్షలాది రూపాయలు ఫీజుల రూపంలో వసూలు చేస్తున్నా, ఇలాంటివి తమ పరిధిలోకి రావని రమేశ్‌ ఆసుపత్రి ఎలా చెప్ప గలిగిందో ఊహాతీతం. ఇతర అవసరాల కోసం భవంతులు తీసుకున్నప్పుడే నియమనిబంధనలకు అనుగుణంగా అవి వున్నాయో లేదో చూస్తారు.

వ్యాధి తీవ్రత ఎక్కువగా వుండే రోగులు తమంత తాము కదలడం కష్టమవుతుంది కనుక వారి కోసం తీసుకునే భవంతి విషయంలో మరింత జాగ్రత్తగా వుండొద్దా?  మంటలంటుకున్న పక్షంలో అందులో చిక్కుకున్నవారిని సురక్షితంగా తర లించడానికి అనువుగా భవనానికి కనీసం రెండు వైపుల మెట్లుండాలి. కానీ స్వర్ణ ప్యాలెస్‌లో వాటి జాడ లేదంటున్నారు. అలాంటి నిర్మాణం వుంటే దాదాపు వ్యాధిగ్రస్తులందరినీ కాపాడటం సాధ్య మయ్యేది. ఇక అక్కడ స్మోక్‌ డిటెక్టర్లు సైతం లేవు. విద్యుత్‌ నియంత్రణ చట్టం ప్రకారం డ్రై కెమికల్‌ పౌడర్, కార్బన్‌ డై ఆక్సైడ్‌(సీఓ2) వగైరాలు వున్నాయో లేదో... వుంటే ఎందుకు వాడలేదో ఇంకా తేలవలసి వుంది. ఇవన్నీ వుంటే ప్రమాద సమాచారం అందుకుని అగ్నిమాపక సిబ్బంది వచ్చేలోగా మంటలు విస్తరించకుండా నిలువరించడానికి ఎంతోకొంత తోడ్పడేవి. వీటి మాట అలా వుంచి మండే స్వభావం వున్న శానిటైజర్లు గ్రౌండ్‌ ఫ్లోర్‌లో నిల్వ చేసి వుంచారని భావిస్తున్నారు. అవన్నీ దిగ్భ్రాంతి కలిగిస్తాయి. |
 

\మన దేశంలో అగ్ని ప్రమాదాల నివారణకు సంబంధించి మెరుగైన నిబంధనలే వున్నాయి. అమెరికా, బ్రిటన్‌ వంటి దేశాల్లో అమలవుతున్న నియమ నిబంధనలకు దీటైనవే వున్నాయి.  పదిహేనేళ్లక్రితం నేషనల్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ చట్టం వచ్చింది. కానీ నిబంధనల అమలులో అంతులేని నిర్లక్ష్యం రాజ్యమేలుతోంది. 2011లో కోల్‌కతాలో ఏఎంఆర్‌ఐ ఆసుపత్రిలో తెల్లారు జామున మంటలంటుకుని 93మంది మరణించారు. భద్రతకు సంబంధించిన నిబంధనలు పాటిస్తే మరికొన్ని లక్షల రూపాయలు అదనంగా ఖర్చవుతాయన్న కారణంతోనే స్వర్ణ ప్యాలెస్‌ వంటి భవం తుల్లో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడంలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. ఆ హోటల్‌కు కనీసం అగ్ని మాపక శాఖ జారీ చేసే నిరభ్యంతర పత్రం(ఎన్‌ఓసీ) కూడా లేదు. లీజుకు తీసుకునే ముందు ఇలాం టివి వున్నాయో లేదో తనిఖీ చేసుకోవడం... వెంటనే ఆ శాఖ అధికారులను సంప్రదించి అది పొంద డానికి అనువుగా అమలు చేయల్సినవేమిటో  తెలుసుకోవడం రమేష్‌ ఆసుపత్రి బాధ్యత కాదా?
 
మృతుల కుటుంబాలు చెబుతున్న మాటలు వింటే దుఃఖం కలుగుతుంది. కోవిడ్‌ నుంచి బయటపడి డిశ్చార్జికి సిద్ధంగా వున్న నలుగురైదుగురు వ్యక్తులు సైతం ఆ ప్రమాదంలో చిక్కుకుని కన్నుమూశారు. చినముత్తేవి గ్రామానికి చెందిన సుంకర బాబూరావుకు పరీక్షలో నెగెటివ్‌గా వచ్చినా ఎందుకైనా మంచిదని ఆసుపత్రిలో చేరి ఈ ప్రమాదంలో చిక్కుకుని ప్రాణాలు పోగొట్టుకున్నారు. బాధిత కుటుంబాలకు అండగా వుంటామని చెప్పడంతోపాటు రాష్ట్ర ప్రభుత్వం రూ. 50 లక్షలు, కేంద్రం రూ. 2 లక్షలు పరిహారం ప్రకటించాయి. కరోనా మహమ్మారి వ్యాప్తి పర్యవసానంగా దేశంలో ఏర్పడ్డ సంక్షోభం కనీవినీ ఎరుగనిది. వైద్యరంగం వ్యాపారమయం కావడంతో ప్రజారోగ్యం పడ కేసింది. ఈ జాడ్యాన్ని ప్రజా సంకల్పయాత్రలో పసిగట్టబట్టే వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారంలోకి రాగానే ఆ రంగాన్ని సమూల ప్రక్షాళన చేయడానికి కంకణం కట్టుకున్నారు. అవి సత్ఫలితాలు ఇవ్వ డానికి మరికొంత సమయం పడుతుంది. ఈలోగా కార్పొరేట్‌ ఆసుపత్రుల నిర్లక్ష్యానికి, నిలువు దోపిడీకి కళ్లెం పడేవిధంగా పకడ్బందీ చర్యలు చేపట్టాలి.

Read latest Editorial News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top