నేను దొంగని కాదు

Mahammad Gouse Telugu Short Story In Sakshi Funday

 కొత్త కథలోళ్లు 

‘‘ఒలే శంకరూ... బడి సూడులే, ఎంత పెద్దగుందో..!’’ గట్టిగా అర్సినాడు గణేశు. స్కూల్‌ ప్రేయర్లో ప్లెడ్జు చెప్పేటప్పుడు తప్ప ఇంగెప్పుడూ వాడట్ల అర్సిండేది చూడలా నేను. 
నిజంగానే బడి చానా పెద్దగుంది. ‘‘ఔరా..! టీవీలో చూపిస్తారు చూడు, అట్లే ఉంది గదరా..!’’ అంటూ అరిచాను నేను కూడా. 
‘‘మాడీలు, మాడీలు ఉంది చూడురా, మన బడి మాదిరి లేదు...’’ అని బడినే చూస్కుంట నిలబడినాడు వాడు. 
మా బడి మాదిరి లేదు ఆ బడి. ఇది రంగులు రంగులుంది. బలే ఉంది. మా బడికైతే సున్నం కొట్టింటారు, అది గుడక వానకి తడ్సి తడ్సి నల్లగ చారలు పడింటాయి గోడల మీద. 
మళ్లీ వాడే ‘‘రంగులు రంగులు బలే ఉంది కదురా ఈ బడి. మనం గుడక ఈడే సదివేదైతే బాగుంటాండ్య...’’ అని చెప్తాంటే వాచ్‌మన్‌ మా దగ్గరికొచ్చి ‘‘ఏయ్‌ బాబూ... పక్కకెళ్ళండి మీరు’’ అంటూ అరిచాడు. 
ఇంతలో మా సారోళ్ళు యెనకాల నుండి వచ్చి ‘‘మేము సైన్సు ఎగ్జిబిషను కోసం వచ్చాం. వీళ్ళు మా స్కూల్‌ పిల్లలే’’ అనడంతో ‘‘అవునా, సారీ సార్‌! స్కూల్‌ డ్రస్‌ ల్యాకపోతే ఎవురో అనుకుని పొమ్మంటాండా’’ అని చెప్పి లోపలికి పంపాడు.
సారోళ్ళతో నేను, గణేశు ఇంగా మిగితా పిల్లోళ్ళు అందరం లోపలికి పోయినాం. అట్ల పొయ్యేటప్పుడు గేటు పక్కనే పూలకుండీ పక్కన బూట్ల జత ఒకటి పడి ఉన్నింది. గణేశు వాటి వైపే చూస్కుంట లోపలికి వచ్చినాడు. అది నేను గమనించినా. 
బయటి నుండి చూసి ‘‘ఏముందిరా... బడి’’ అనుకున్యాం. లోపలికి పోయినాక నేను, గణేశు ఒకరి మొగం ఇంకొకరం చూస్కుంటాన్నాం... అంత బాగుంది లోపల. 

ఇద్దరం అట్లే చూస్కుంట నడుస్తా ఉండంగ మా ఇద్దర్నీ సారోళ్ళు పిలిచి ‘‘అందరూ యూనిఫారమ్స్‌లో వచ్చారు. మీ ఇద్దరికీ ఏం రోగంరా, కలర్‌ డ్రస్‌లో వచ్చారు..?’’ అనడిగారు. 
ఏం చెప్దామా అని ఆలోచిస్తా ఉండంగ గణేశు ‘‘నాకున్నేది ఒక జతే సార్‌. మాయమ్మకు తెల్దు ఈ పొద్దు మనం కర్నూలు వస్తాన్నామని. అందుకే ఉతుకుదామని నానేసింది. పొద్దునకి యాడా ఆరలేదు సార్‌. అందుకే కలర్‌ డ్రస్‌’’ అని చెప్పి నా వైపు చూశాడు. 
‘‘మాయమ్మ ఉతికి షర్టుకి నీలం పెట్టింది సార్‌. అది ఎక్కువైపోయింది. అందుకే నేను గుడక కలర్‌ డ్రస్‌ ఏస్కోని వచ్చిన’’ అని అప్పటికి తట్టిన అబధ్ధం చెప్పా నేను. 
‘‘సరే లెండి, రేపైనా యూనిఫారమ్స్‌లో రండి. ఇందాక చూశారుగా, వాచ్‌మన్‌ ఎలా పొమ్మన్నాడో... మనం వేసుకునే బట్టల్ని బట్టి కూడా మనుషులు మనతో నడుచుకునే విధానం మారుతుంది. మీలాగ చదువుకునే పిల్లలు మంచిగా ఉండాలి. ఎవరితోనూ మాటలు పడకూడదు...’’ అని చెప్పేసి ముందుకు కదిల్నారు సారోళ్లు. 
అప్పుడు గణేశు నా దగ్గరికొచ్చి ‘‘అవులే, నీ దగ్గిర రెండు జతలు కదలే ఉన్నేది. రెండూ ఈరోజే ఉతికేసిందా అమ్మ?’’ అని అడగ్గానే ‘‘అందురూ స్కూల్‌ డ్రస్‌లోనే వస్తారని నాకు తెలుసు. నేను గుడక అదే తొడుక్కుందామనుకునుంటిని. అంతలో నువ్‌ మా ఇంటి కాడికి వస్తివి కదా, కలర్‌ డ్రస్సులో. ఇంగ నేను గుడక స్కూల్‌ డ్రస్‌ తొడుక్కుంటే నువ్వొగనివే అయిపోతావ్‌. సారోళ్ళు తిడ్తారేమో అని  నేను గుడక కలర్‌ డ్రస్సులోనే వచ్చిన’’ అని నిజం చెప్పినా వానికి. 

వాడదంతా విని నవ్వి, ఏదో గుర్తుకు తెచ్చుకున్నట్టు మొకం పెట్టి ‘‘ఆడా... నేను బూట్లు చూసినా లే’’ అన్నాడు.
‘‘యాడా..?’’ తెలీనట్లు అడిగినా నేను. 
‘‘గేటు ముందర...’’
‘‘ఎవురివీ..?’’
‘‘ఏమోబ్బా.. ఆడే ఉన్యాయి.’’
‘‘సరే లెలే... సారోళ్లు ముందర్కి ఎళ్లిపోయినారు. నడ్సు తొందర్గా...’’ అని చెప్పినా. 
మా క్లాసోళ్ల దగ్గరికిపోయి నిలబడుకున్యాం. 
సైన్సు ఎక్స్‌పరిమెంట్లు ఒకదాని పక్కన ఇంగొకటి పెట్టుకోని ఉండారు. టేబుల్ల మీద పెట్టి, యెనకాల గోడల మీద చార్టులు తగిలిచ్చి చెప్తా ఉన్నారు. మేమంతా ఒక్కోటి చూస్కుంటా పోతాన్నాం. 
కొన్నైతే టెక్స్‌›్ట బుక్కులో చూసిన బొమ్మలు గుడక వస్తువుల రూపంలో ఉండాయి ఆడ. 
ఆ స్కూలు పిల్లోళ్లంతా స్కూల్‌ డ్రస్సు, బూట్లు తొడుక్కోని, షర్టులు ప్యాంట్లలోకి టక్కులు చేస్కోని ఉండారు. వాళ్లందరినీ అట్ల చూసి మా తుట్టు మేం చూస్కుంటాంటే ఎట్లనో అనిపిస్తాంది. 
‘‘వీళ్ల మాదిరి మనక్కూడా బూట్లు ఏస్కున్నేది, టక్కు చేస్కున్నేది ఉండింటే బాగుండు కదురా...’’ ఆ స్కూలు పిల్లోళ్ల పక్క చూస్కుంట నాతో అన్నాడు గణేశు. 

‘‘యాడైతాది లేప్పా! ఈడ ఊరికే ఇయ్యరు అవి. లెక్క కట్టల్ల. లక్షల్లో ఉంటాది ఫీజు. మన మాదిరి కాదు.’’ అన్నా నేను. 
‘‘ఏమోలే... చూడనన్న చూస్తాన్నాం ఈరోజు. ఇట్లాటి బడి ఎప్పుడో గాని చూడలా...’’
‘‘ఎంతసేపు చూసినా అన్నీ కొత్తగానే ఉండాయి...’’
చూస్తా చూస్తా క్లాసు రూముల వైపు పోయినాం. 
‘ఒలే... ఈడ చూడు వీళ్లకి బెంచీలు గుడక ఉన్నాయి. కింద కుచ్చోరేమో వీళ్లు’’ మళ్లీ అర్సినాడు గణేశు. 
‘‘ఔ గదరా... మంచి చాన్సు, వీళ్లకే మేలు.’’
ఇట్ల అన్ని చూస్కుంట ఆశ్చర్యపడటంలోనే సాయంకాలమయింది. 
 
‘‘మన స్కూలోళ్లందరు వచ్చి లైన్లో నిలబడండి’’ అనుకుంట పిల్లోళ్లంతా ఉన్నారో లేదో చూస్కుంటాన్నారు సారోళ్లు..
గేటు గుండా బయటికి నడుస్తాన్నాం. సరిగ్గా గేటు దాటంగానే నేను గణేశు వైపు చూశా. వాడు ఆ పూల కుండీ పక్కనున్న బూట్ల వైపు చూస్తాన్నాడు. అవి ఇంగా ఆడనే ఉన్నాయి. 
అప్పుడు నేను ‘‘బూట్లు బాగున్నాయిలే... ఎవురో ఆడ పెట్టినారు’’ అన్నా వాడితో. 
‘‘నేను గుడక అదే అనుకుంటాన్నా...’’ అని చెప్పాడు. 
అందరం బస్సెక్కి ఎవరి ఇళ్లకి వాళ్లు వచ్చేసినాం. 
∙∙ 
 తర్వాత రోజు మేమే అందరికంటే ముందే బస్సు దిగి పోయి గేటు బయట నిలబడినాం. ముందురోజు స్కూలు చూస్కుంట నిలబడిన మేము తర్వాతి రోజు బూట్లు చూస్కుంట నిలబడినాము. అవి ఆరోజు గుడక ఆడనే ఉన్నాయి. ఇద్దరం ఒకరి మొగం ఇంగొకరం చూస్కొని నవ్వుకుంటాన్నాం. అవి మావి కాకపోయినా మాకెందుకో అంత ఆనందం. 
 ఇంతలో సారోళ్లు వచ్చి లోపలికి తీస్కపోయినారు మమ్మల్ని. 
‘‘ఈరోజు కూడా నిన్నటిలాగే అల్లరి చేయకుండా మంచిగ ఉండండి’’ అని చెప్పారు సారోళ్లు.
‘‘ఒలే.. నాకో ఐడియా...!’’ నా దగ్గరికొచ్చి అన్నాడు గణేశు. 
‘‘ఏందిలే...’’
‘‘పాసుకని చెప్పి పోదాం... బూట్ల కాడ్కి’’
‘‘కానీ బాత్రూములు లోపలే ఉండాయి కదా..?’’
‘‘మనం యా పక్క పోతాన్నేది సారోళ్లు చూడరులే యాడా...’’
‘‘సరే... నేను పోయి అడుగుతా, ఇద్దరం పోదాం...’’
సార్‌ దగ్గరికి పోయి అడగ్గానే సరే వెళ్లమన్నాడు సారు. 
గణేశు దగ్గరికిపొయి నేను ‘‘పొమ్మన్యాడు సారు..’’ అని చెప్పా. 
గేటు వైపు నడుస్తాన్నాం ఇద్దరం. మేం బయటికి పోతాన్నేది సారోళ్లు చూస్తారేమో అని మధ్య మధ్యలో యెనక్కి తిరిగి చూస్తాన్నా. ఇంతలో గణేశు ‘‘ఒలే... ఊరికే ఒగసారి కాళ్లకేస్కుని చూస్తా అంతే. మళ్లా ఆడే పెట్టేసి వద్దాం...’’ అన్నాడు. 
‘‘సరేలేరబ్బా... నేనేం దొంగతనం చేద్దాం అని కాదు వస్తాండేది, ఏస్కోని చూసేకేలే...’’ అంటూ నడుస్తున్నాను. 
మా అదృష్టం గేటు దగ్గిర వాచ్‌మన్‌ లేడు.
పూలకుండీ పక్కన చూసినాం. బూట్లు ఆడే ఉండాయి! 

తీస్కొని కాళ్ళకి ఏస్కున్నాడు గణేశు. ‘‘లేసు కట్టుకోలే...’’ అన్నా నేను. 
‘‘సరేరా!’’ అని చెప్పి కట్టుకుని, తన కాళ్లనీ వాటికున్న బూట్లనీ అట్లనే చూస్కుంట సంబరపడ్తాన్నాడు గణేశు. మొగం ఆనందంతో వెలిగిపోతాంది. అడుగులేసి ఒకసారి, నిలబడుకోని ఒకసారి, ‘సెల్యూట్‌’ అని కుడికాలు గట్టిగా నేల మీద కొట్టి ఒకసారి, ఇట్ల చానా రకాలుగా చేసి సంబరపడ్తాన్నాడు.
అదే ఫస్టు టైమ్‌ వాడు బూట్లేసుకోవడం. వాడు తీసేస్తానే నేను గుడక ఒకసారి ఏస్కుని చూద్దామని చూస్తాన్నా. నేను గుడక ఎప్పుడు బూట్లేసుకోలా. 
‘‘ఇంగ తీసేస్తాలే, నువ్‌ గుడక ఏస్కుందువు’’ అంటూ బూట్లు తీస్తూ ఉండగా వాచ్‌మన్‌ వచ్చాడు. 
గణేశు వైపు కోపంగా చూస్తాన్నాడు. ‘‘న్నా... నేను ఊరికే ఏస్కోని చూస్తాన్నా...’’ అని చెప్తూ ఉండగా గణేశు చెంప మీద గట్టిగా కొట్టాడు వాచ్‌మన్‌. చెప్పేదైనా వినిపిచ్చుకోకుండా కొట్టినాడు. అప్పుడు గణేశుని చూస్తే నాకే ఏడుపొచ్చింది. 
‘‘దొంగతనం చేస్తార్రా... దొంగ నాయాల్లారా, అందుకే మీ అట్లాటోళ్ళని ఇట్లాటి బడుల వైపే రానీయకూడదు’’ అంటూ అరిచాడు. 
అక్కడ ‘మీ అట్లాటోళ్ళని’ అని అనడంలో ఏమర్థముందో నాకు తెలియలా. తర్వాత కొంచెం పెద్దగైనాక అర్థమయింది. 
నన్ను కూడ కొడదామని చెయ్యెత్తినాడు. నేను పక్కకి జరిగిన. దెబ్బ తగల్లేదు.
ఇంగ బడిలోకి కూడా పోలేదు మేము. అట్లే బస్టాండుకుపోయి మా ఊరి బస్సెక్కినాం. బస్సులో గంటసేపున్నాం. ఒక్కమాట కూడా మాట్లాడలేదు వాడు. ఆ తర్వాతిరోజు బడికి రాలేదు. మాట్లాడదామని వాళ్లింటి కాడికిపోతే కూడ సరిగ్గ మాట్లాడలేదు. వాడే మాట్లాడాతాడులే అని యెనక్కి వచ్చేసినా. 
ఒక్కడే కొడుకవ్వడంతో గణేశునెప్పుడూ వాళ్లమ్మ కొట్టలేదు. క్లాసులో అందరి కంటే బాగా చదివేవాడు కాబట్టి సారోళ్ల చేతిలో కూడ ఎప్పుడు దెబ్బలు తినలేదు. 

జీవితంలో మొదటిసారి చెంప దెబ్బ తిన్నాడు. అది కూడా చేయని తప్పుకి. 
తనకి పుట్టిన చిన్న కోరిక వల్ల దొంగ అనే మాట పడాల్సి వచ్చింది. వాచ్‌మన్‌ మీద వచ్చిన కోపం బూట్ల మీదకి మళ్లింది వాడికి. అంతే! 
ఆ రోజు తర్వాత మళ్లెప్పుడూ వాడు బూట్లు ఇష్టపడటం కానీ, వేసుకోవటం కానీ చేయలేదు. 
సంవత్సరాలు గడిచినా... ఆ చేదు ఙ్ఞాపకం అలానే ఉండిపోయింది.
అది జరిగిన కొన్ని రోజులకి వాడి నోట్సులో చూశాను. 
‘నేను దొంగని కాదు’ అని రాసి ఉన్నింది.
- మొహమ్మద్‌ గౌస్‌

Read latest Funday News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top