ఇది నేరుగా జగన్‌ సర్కారుపై కుట్ర

Kommineni Srinivasa Rao Article On Government Of Andhra Pradesh - Sakshi

విశ్లేషణ  

ఏపీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద కుట్రే జరుగుతోందన్న అనుమానం వస్తోంది. టీడీపీ మీడియాలో వస్తున్న కథనాలు, దానికి తగ్గట్లుగా తెలుగుదేశం నేతలు కొందరు చేస్తున్న ప్రచారం ఇవన్నీ చూస్తుంటే ఏదో పెద్ద వ్యూహంలోనే తెలుగుదేశం పార్టీకానీ, వారి మీడియా కానీ ఉందని అర్థం అవుతుంది. ప్రజాక్షేత్రంలో ఇప్పటికిప్పుడు ముఖ్యమంత్రి జగన్‌ను చేయగలిగింది ఏమీ లేదు సరికదా.. వచ్చే  2024 ఎన్నికలలో కూడా గెలుస్తామన్న ఆశ టీడీపీ వారిలో కనిపించడం లేదు. ఈ నేపధ్యంలో జగన్‌ ప్రభుత్వాన్ని ఎలా అప్రతిష్టపాలు చేయాలి, తమ కుట్రలతో ఏమైనా జగన్‌ను దెబ్బకొట్టవచ్చా అన్న ఆలోచనలు టీడీపీలో సాగుతున్నట్లుగా ఉన్నాయి. తాజాగా టీడీపీ పత్రికలో వచ్చిన కథనం చూస్తే అత్యంత ఆశ్చర్యం కలుగుతుంది. న్యాయ దేవతపై నిఘా అంటూ రాసిన ఆ కథనంలో  ప్రతి లైన్లో కుట్ర కనిపిస్తుంది. ఏదో ఒక కేసులో జగన్‌ ప్రభుత్వాన్ని ఇరికించాలని, తద్వారా జగన్‌ను రాజకీయంగా దెబ్బకొట్టాలన్న తపన కనిపిస్తోంది.

గతంలో ఇంటెలిజెన్స్‌ డీజీగా ఉన్న అధికారి ఎందరిపైన నిఘా పెట్టినా, ఆయనను చాలా గొప్పవాడిగా కీర్తించేది. అది వేరే విషయం. ఇక్కడ ఇంకో విషయాన్ని కూడా గమనించాలి. జడ్జీల ఫోన్లు ఏదో రూపంలో నిజంగానే నిఘాకు గురి అవుతున్నాయని వారు నమ్మితే, ఈ పాటికి వారు కోర్టులో చెప్పడమో, లేక ప్రభుత్వానికి ఫిర్యాదు చేయడమో చేసేవారు. కాని అలాం టిది ఏమీ జరగలేదు. కానీ తెలుగుదేశం మీడియాకు మాత్రమే ఎలా తెలిసింది. అంటే న్యాయ వ్యవస్థలోని వారు తమకు  చెప్పారని టీడీపీ మీడియా ప్రచారం చేసుకోవడానికి ఈ కథనం ఉపయోగపడుతుంది. అంతేకాదు. న్యాయ వ్యవస్థలో తమకు పలుకుబడి ఉందని కూడా ప్రచారం చేసుకోవడానికి ఈ కథనం రాసినట్లుగా ఉంది. 

అదే సమయంలో ఒక అభ్యంతరకర విషయం రాశారు. న్యాయమూర్తులకు సంబంధించి ఇబ్బందికర విషయాలను సేకరించడానికి ఈ నిఘా పెట్టారని పేర్కొన్నారు. మెజార్టీ న్యాయమూర్తులకు ఇబ్బంది కలిగించే అంశాలు ఏమి ఉంటాయి? వారు గౌరవ న్యాయమూర్తులు, వారు ధర్మంగా, చట్టబద్ధంగా వ్యవహరించే వారు. అలాంటి వారిని ఈ టీడీపీ మీడియా అనుమానిస్తోందా? ఇలాంటి రాతలు రాయడం ద్వారా న్యాయవ్యవస్థను కించపరుస్తున్నారు. ఇక రిటైర్డ్‌ జడ్జి ఈశ్వరయ్య, ఒక సస్పెండైన జూనియర్‌ న్యాయాధికారితో మాట్లాడిన విషయాలపై ఎంత రాద్ధాంతం చేశారు. చివరికి హైకోర్టుకు కూడా పంపించి, వారికి సందేహాలు వచ్చేలా  చేయడంలో కొంత కృతకృత్యమయ్యారనుకోవాలి. నిజానికి ఈశ్వరయ్య న్యాయవ్యవస్థలోని ప్రముఖులు కొందరిపై విమర్శలు చేయడం కొత్త కాదు. కానీ ఇప్పుడు ఈ పెన్‌ డ్రైవ్‌ ఆధారంగా ఆయనను ఇబ్బంది పెట్టవచ్చనుకున్న టీడీపీ మీడియా లక్ష్యం కొంత నెరవేరింది. హైకోర్టు దానిపై స్పందించడం తప్పు కాదు. అయితే ఇప్పుడు ఈశ్వరయ్య తన వాదనను మరింత బలంగా వినిపిస్తే, న్యాయ వ్యవస్థలోని లొసుగులను విచారణ కమిషన్‌ ముందు మరింత బలంగా వినిపిస్తే, న్యాయ వ్యవస్థకు కొంత అప్రతిష్ట వచ్చే అవకాశం ఉంటుందా అన్న చర్చ కూడా సాగుతోంది. అయినా అదేం అవుతుందో చెప్పలేం. అయినా ఈశ్వరయ్య తను ఉన్న పదవిలో ఎంతో బాధ్యతగా ఉండాలి. ఎవరెవరితో ఏదేదో మాట్లాడితే ప్రభుత్వానికి ఇబ్బంది అన్న సంగతి కూడా గుర్తించాలి. 

నిజానికి ఆ వ్యవహారంలో ప్రభుత్వానికి ఏమీ సంబంధం లేదు. అందువల్లే టీడీపీ మీడియా ఈ కొత్త డ్రామాకు తెరదీసిందన్న అనుమానం కలుగుతోంది. ఏకంగా న్యాయ వ్యవస్థకు, ఏపీ ప్రభుత్వానికి మధ్య అంతరం బాగా పెంచాలన్న లక్ష్యంతో వారు ఈ కథనం వండినట్లుగా ఉంది. ఇలాంటి వార్తలు రాయడంలో ఈ పత్రిక పేరు గాంచిందే. గతంలో ఒకసారి వైఎస్‌ క్యాబినెట్లో జేసీ దివాకర్‌రెడ్డి పంచాయతీ రాజ్‌ మంత్రిగా ఉండేవారు. ఆయన తిరుమల ఆధ్యాత్మిక క్షేత్రం కనుక అక్కడ పంచాయతీ ఎన్నికలు పెట్టకూడదన్న ఉద్దేశంతో కొంత పరిధి పెట్టి ఆ ప్రాంతంలో పంచాయతీ ఎన్నికలు ఉండవని ఒక సదుద్దేశంతో నోటిఫికేషన్‌ ఇచ్చారు. కానీ దానిని ఈ పత్రిక ఎలా వక్రీకరించిందంటే ఏడుకొండలను మూడు కొండలు చేశారంటూ దానిని వైఎస్‌కు అంటకట్టే యత్నం చేసింది. అలాంటి కుట్రలు చేయడంలో మొనగాడైన ఈ పత్రిక అధిపతి, రాజకీయ కుట్రలు చేయడంలో అంతకన్నా మొనగాడైన చంద్రబాబుతో కలిసి జగన్‌కు వ్యతిరేకంగా ఇలాం టివన్ని ప్లాన్‌ చేస్తున్నారా అన్న సంశయం కలుగుతుంది. గతంలో ఎన్టీఆర్‌కు వ్యతిరేకంగా కాంగ్రెస్‌ పార్టీ అనేక కేసులు వేస్తుండేది.

వాటిలో వ్యతిరేక తీర్పులు వస్తే ఇన్ని కేసుల్లో షాక్‌ అంటూ ప్రచారం చేసేది. 1983–89 మధ్య  దాదాపు 30 కేసుల్లో ఎన్టీఆర్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులు వచ్చాయి. చివరికి ఆయనపై వ్యక్తిగతంగా కూడా అవి నీతి ఆరోపణలు చేస్తూ కేసులు వేస్తే ఏడు అంశాలలో ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని అప్పట్లో ఒక తీర్పు వచ్చింది. దానిపై ఎన్టీఆర్‌ తనకు ప్రజాకోర్టు ముఖ్యమని వ్యాఖ్యానించారు. అప్పట్లో ఆ తీర్పుపై పలు విమర్శలు కూడా వచ్చాయి. అది వేరే విషయం. ఇక 1994లో వృద్ధాప్యంలో కూడా ఎన్టీఆర్‌ ప్రజలలో తిరిగి అధికారం తెచ్చుకుంటే ఆయనకు వ్యతిరేకంగా ఆయన క్యాబినెట్‌ లోనే ఉంటూ చంద్రబాబు ఏ రకంగా విష ప్రచారం చేసిందీ అప్పుడు రాజకీయాలు చూసినవారందరికి తెలుసు. 

చంద్రబాబుకు మద్దతు ఇచ్చే పత్రికలు ఎంత ఘోరంగా కథనాలు రాసేవో కూడా తెలుసు. ఇప్పుడు కూడా 151 సీట్లతో అధికారంలోకి వచ్చిన జగన్‌ ప్రభుత్వాన్ని ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలని విశ్వప్రయత్నం చేస్తున్నారు. కొందరు టీడీపీ నేతలు కానీ, వారికి మద్దతు ఇచ్చే కొందరు కానీ టీవీలలో కూర్చుని జగన్‌ ప్రభుత్వం రద్దు అయిపోతుందని ప్రచారం చేసేవరకు వెళుతున్నారంటే వారి ఆలోచనలు ఎంత విషపూరితంగా ఉంటున్నాయో అర్థం చేసుకోవచ్చు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇలాంటి చీడ పురుగులు ఎప్పుడూ ఉంటాయి. కానీ ఇప్పుడు జరుగుతున్న కుట్రలు చూస్తుంటే మాత్రం, రాజకీయం ఇంత నీచంగా, ఇంత క్షుద్రంగా, ఇంత రాక్షసంగా మారుతుందా అన్న బాధ కలుగుతుంది. ప్రభుత్వాన్ని పనిచేయనివ్వకుండా చేయడం వీరి లక్ష్యం.

ప్రభుత్వంపై బుదర చల్లడం వీరి ఆచరణ. తద్వారా ఏదో జరిగిపోతోందన్న భ్రమను ప్రజలలో కలిగించాలన్నది వీరి ఆకాంక్ష. అయితే సోషల్‌ మీడియా కూడా విస్తారంగా ఉండడంతో వీరి ఆటలు అంతగా సాగడం లేదు. అందువల్లే 2019 ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ ఘోరంగా ఓటమి పాలైంది. ఇప్పుడు జనంలో మళ్లీ ఆదరణ పొందుతున్న గ్యారంటీ కనిపించడం లేదు. దాంతో రూటు మార్చి కొత్త కుట్రలు చేయడం ఆరంభించారు. ఒక వైపు న్యాయవ్యవస్థను అడ్డు పెట్టుకుని రకరకాల కేసులు వేస్తున్నారు. ఆ కేసుల్లో తీర్పులు రాగానే హైకోర్టు షాకిచ్చింది.. అది ఇచ్చింది అంటూ కథనాలు రాస్తున్నారు. 

జగన్‌కు ఇదేమి కొత్త అనుభవం కాదు. జగన్‌ ఎంపీగా ఉన్నప్పుడు, టీడీపీ, కాంగ్రెస్‌లు కలిసి ఆయనపై హైకోర్టులో కేసులు వేసినప్పుడు, ఆ తర్వాత జరిగిన పరిణామాలపై టీడీపీ మీడియాలోని రెండు పత్రికలు ఏ విధంగా పుంఖానుపుంఖాలుగా ఉన్నవి, లేనివి వడ్డించి వార్చిన విషయాలు తెలియనివి కావు. సీబీఐ విచారణలో ఏమి జరిగేదో కాని, తెల్లవారేసరికి ఏదో ఒక కథ జగన్‌కు వ్యతిరేకంగా ఉండేది. అయినా జగన్‌ మొండి ధైర్యంతో ఎదుర్కున్నారు కాబట్టి సరిపోయింది. అదే చంద్రబాబు విషయంలో మాత్రం ఆయన అదృష్టం అదేమో కానీ, ఏ కేసు అయినా ఆయనకు తేలికగా స్టే వచ్చేస్తుంటుంది. చివరికి అంత పెద్ద ఓటుకు నోటు కేసులో కూడా ఆయనకు ఏమీ కాలేదు. కానీ ప్రజల దృష్టిలో ఆయన పెద్ద నేరం చేశారని నమ్మారు కాబట్టి దారుణంగా ఓడించారు. గతంలో ఎన్టీఆర్‌ను బదనాం చేసిన రీతిలో చంద్రబాబు కానీ, ఆయన మీడియా కానీ ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే ఆంధ్రజ్యోతి రాసిన కల్పిత కధకు కొంత వత్తాసు ఇవ్వడం కోసం చంద్రబాబు ప్రధాని మోదీకి ఫోన్‌ ట్యాపింగ్‌ అంటూ లేఖ రాశారు.

అందులో మోదీని పొగిడిన తీరు చూసి బీజేపీ వారే విస్తుపోతున్నారు. లేఖ రాయడం కూడా ఒక కుట్రే. ఒక్క ఆధారం చూపకుండా, ఎవరి ఫోన్లు ట్యాప్‌ అయ్యాయో తెలపకుండా ఉత్తరం రాసిన తీరు బట్టకాల్చి మీద వేయడం వంటిదే. జగన్‌ ప్రభుత్వ నిర్ణయాలకు వ్యతిరేకంగా ప్రతి దానికీ కోర్టుకు వెళ్లడం, ఏదో రకంగా ఆటంకం కలిగించడం చేస్తున్నారు. జగన్‌ ముఖ్యమంత్రి కాగానే తన పని తాను చేసుకుంటే పోతుం దని అనుకున్నారు. కానీ ఆయా వ్యవస్థలతో లౌక్యంగా ఉండాల్సిన పరిస్థితి ఉందని ఆయన అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఏ వ్యవస్థ అయినా ఉండేది, నడిపేది మనుషులే కదా.. ఏ వ్యవస్థలో అయినా బలాలు, బలహీనతలు ఉంటాయి. ప్రజలను సంతృప్తిపరచి వారు కోరుకున్నట్లు పనిచేయడం ఒక ఎత్తు. చంద్రబాబు కానీ, టీడీపీ మీడియా పన్నే కుట్రలు కానీ ఎదుర్కోవడం మరో ఎత్తు అన్న సంగతి అర్థం చేసుకోవాలి.

ఎందుకంటే టీడీపీ మీడియాలో ఏదో ఒక కట్టుకథ రాస్తారు. దాని ఆధారంగా ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు పడవచ్చు. ఆ మీదట న్యాయ వ్యవస్థ వాస్తవాలు తెలుసుకునే ఉద్దేశంతో విచారణకు ఆదేశించవచ్చు. దాని ఆధారంగా మళ్లీ ప్రభుత్వంపై బురద చల్లవచ్చు. అందులోను ఫోన్‌ ట్యాపింగ్‌ అనే ఆరోపణలు చేయడం ద్వారా ముఖ్యమంత్రిని నేరుగా ఇరకాటంలో పెట్టవచ్చన్నది వీరి భావన కావచ్చు. గతంలో తమ ప్రభుత్వ హయాంలో జరిగిన తప్పుడు పనులన్నిటినీ జగన్‌కు ఆపాదించి పలుచన చేయాలన్నది వారి లక్ష్యం. అందువల్ల ప్రభుత్వపరంగా జగన్‌ ప్రభుత్వం అత్యంత అప్రమత్తంగా వ్యవహరించవలసిన సమయం ఆసన్నమైనదని చెప్పాలి. న్యాయ వ్యవస్థకు, ప్రభుత్వానికి మధ్య మరింత అంతరం పెంచడం ద్వారా తమ లక్ష్యాన్ని నెరవేర్చుకోవాలన్న కుట్రదారులకు ఏ మాత్రం చాన్స్‌ ఇవ్వకూడదని మాత్రం గట్టిగా చెప్పాలి. కనుక తస్మాత్‌ జాగ్రత్త అని జగన్‌ ప్రభుత్వానికి చెప్పవలసి ఉంటుంది.

వ్యాసకర్త సీనియర్‌ పాత్రికేయులు  
కొమ్మినేని శ్రీనివాసరావు
 

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top