చూడు చూడు నీడలు!

vardelli murali Article On Chandrababu Naidu - Sakshi

జనతంత్రం

ప్రజాస్వామ్య వ్యవస్థల మీద నీలినీడలు పరుచుకుంటున్న దృశ్యం ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తున్నది. ఆ నీడలతో క్రీడలాడు తున్న వారి ముఖ కవళికలు ఇప్పుడు తేటతెల్లంగా కనిపిస్తు న్నాయి. సాఫ్‌ సీదా.. ఖుల్లమ్‌ ఖుల్లా!... ‘చూడు చూడు నీడలు, సూర్యునితో క్రీడలు. సూర్యునిలో సూదులతో క్రీడలాడు నీడలు!’ అన్నారు శ్రీశ్రీ. న్యాయవ్యవస్థతో కూడా క్రీడలాడే నీడ లిప్పుడు భయంగొలుపుతున్నాయి. ఆ భయం దేశవ్యాప్త చర్చను రాజేసింది. ఈ చర్చకు రెండు పార్శా్వలు. ఒకటి: న్యాయవ్యవస్థ క్రియాశీలత శృతిమించి శాసన, కార్యనిర్వాహక విభాగాల్లో అతి జోక్యంగా మారిందా? రాజ్యాంగం హామీ ఇచ్చిన పత్రికా స్వేచ్ఛను కబళిస్తున్నదా! రెండు: రాజకీయ వ్యవస్థకు, న్యాయ వ్యవస్థకు మధ్యన అవాంఛనీయమైన బంధం ఏదైనా ముడిపడుతున్నదా? ఈ రెండో పార్శా్వనికి సంబంధించిన ఆందోళన గడిచిన కొన్నేళ్లుగా ఈ దేశంలోని బుద్ధిజీవుల మాటల్లో వ్యక్తమవుతూనే ఉన్నది. ఆంధ్రప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకూ, సుప్రీంకోర్టు లోని ఒక న్యాయమూర్తికీ ఉన్న సంబంధాలపై సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ చలమేశ్వర్‌ అప్పట్లోనే సందేహా లను లేవనెత్తారు. ‘ఎకనామిక్‌ టైమ్స్‌’ పత్రిక కథనం ప్రకారం జస్టిస్‌ చలమేశ్వర్‌ 2017 మార్చి 28న అప్పటి చీఫ్‌ జస్టిస్‌కు రాసిన లేఖలో నాటి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు సుప్రీంకోర్టులో ఉన్న ఒక న్యాయమూర్తికి ఉన్న సన్నిహిత సంబంధాల విషయాన్ని ప్రస్తావించారు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ హైకోర్టుకు ఆరుగురు న్యాయమూర్తుల నియామకా నికి సంబంధించి చంద్రబాబు రాసిన లేఖ అంశాలు, న్యాయ మూర్తి వ్యక్తం చేసిన అంశాలు దాదాపు ఒకేరకంగా ఉండటమే కాకుండా, ఇద్దరూ మూడు రోజుల తేడాతోనే లేఖలు రాయడం కూడా వారి మధ్య ఈ విషయంపై సంప్రదింపులు జరిగి ఉండ వచ్చన్న అనుమానాలకు తావిస్తున్నాయని జస్టిస్‌ చలమేశ్వర్‌ ఆ లేఖలో వ్యాఖ్యానించినట్టు పత్రిక పేర్కొన్నది. న్యాయవ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థల మధ్య అవాంఛనీయమైన సంబంధా లకు జస్టిస్‌ చలమేశ్వర్‌ పేర్కొన్న అంశం అతిపెద్ద ఉదాహరణగా పలువురు న్యాయనిపుణులు వ్యాఖ్యానించినట్టు కూడా పత్రిక వెల్లడించింది. 2016 ఏప్రిల్‌ 30వ తేదీనాడు అప్పటి ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆరుగురు న్యాయవాదుల పేర్లను జడ్జి పదవులకోసం ప్రతిపాదించారు. ఆ పేర్లపై ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల అభిప్రాయాలను కోరారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ వెంటనే తన అభిప్రాయాన్ని తెలియ జేశారు. చంద్రబాబు మాత్రం 11 నెలల తర్వాత ఆరుగురి నియామకంపై తన అభ్యంతరాలను వ్యక్తం చేస్తూ 2017 మార్చి 21 నాడు అప్పటి న్యాయశాఖ మంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌కు లేఖ రాశారు. మరో మూడు రోజులకు సుప్రీంకోర్టు న్యాయమూర్తి ప్రధాన న్యాయమూర్తికి తన అభిప్రాయాలను తెలియజేసినట్టు ‘ఎకనామిక్‌ టైమ్స్‌’ పేర్కొన్నది. న్యాయవ్యవస్థతో చంద్రబాబు నెరిపే సంబంధాలపై హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ ఈశ్వరయ్య గౌడ్‌ పలుమార్లు బహిరంగంగానే ధ్వజమెత్తారు. బీసీ వర్గాల పట్ల వివక్షతో జడ్జీలుగా నియమించడానికి బీసీ న్యాయవాదులు పనికిరారని కూడా చంద్రబాబు లేఖ రాశారని ఈశ్వరయ్య గౌడ్‌ ఆరోపించారు.

గడిచిన మంగళవారంనాడు, బుధవారంనాడు ఆంధ్ర ప్రదేశ్‌ హైకోర్టు రెండు కీలకమైన నిర్ణయాలు ప్రకటించింది. రాజధాని భూముల్లో జరిగిన ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌కు సంబంధించి అవినీతి నిరోధక శాఖ కొంతమందిపై ఎఫ్‌ఐఆర్‌ను నమోదు చేసింది. ఎఫ్‌ఐఆర్‌లోని అంశాలను మీడియా–సోషల్‌ మీడియా బహిర్గతం చేయొద్దని ‘గ్యాగ్‌’ ఆర్డర్‌ ఇవ్వడంతోపాటు, ఆ ఎఫ్‌ఐఆర్‌ మీద దర్యాప్తు కూడా ముందుకు సాగొద్దని హైకోర్టు ఆదేశించింది. గత ప్రభుత్వం చేసిన తప్పిదాలపై మంత్రివర్గ ఉపసంఘం సమర్పించిన నివేదిక ఆధారంగా ప్రత్యేక దర్యాప్తు బృందం చేస్తున్న దర్యాప్తును నిలిపివేయాలని, గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై దర్యాప్తు చేయకూడదని బుధవారం నాడు న్యాయస్థానం ఆదేశించింది. ఈ పరిణామాలు దేశ వ్యాప్తంగా సంచలనం కలిగించాయి. జాతీయ మీడియా, సోషల్‌ మీడియా కూడా తీవ్రంగా స్పందించాయి. ఈ నేపథ్యంలో టీడీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో చంద్రబాబు మాట్లా డుతూ న్యాయమూర్తులకు రాజధాని ప్రాంతంలో ఇళ్లస్థలాల కేటాయింపు విషయాన్ని ప్రస్తావించారు.

ఒక పద్ధతి ప్రకారం సివిల్‌ సర్వీస్‌ అధికారులకు, జడ్జీలకూ స్థలాలను కేటాయిం చామని, దీన్ని కూడా తప్పుపడుతున్నారని అధికార పార్టీ మీద నిందారోపణ చేశారు. వాస్తవానికి అప్పటివరకూ ప్రత్యర్థి పార్టీలకు సంబంధించిన ఏ ఒక్కరూ కూడా న్యాయమూర్తుల ఇళ్లస్థలాల విషయంపై విమర్శలు చేయలేదు. అసలు ఆ విషయం మాట్లాడనే లేదు. పైగా సిటింగ్‌ జడ్జీలకు వ్యక్తిగత హోదాలో స్థలాల కేటాయింపుపై ఇప్పటికే గుజరాత్‌ హైకోర్టులో ఒక వివాదం పెండింగ్‌లో ఉన్నది. ప్రభుత్వం ఇళ్ల స్థలాలకు ఇచ్చే భూమిని ఆయా అసోసియేషన్ల పేరున బదిలీ చేయాలి గానీ, వ్యక్తిగత హోదాలో ఎలా కేటాయిస్తారని ఒక పిటిషనర్‌ వేసిన వ్యాజ్యాన్ని హైకోర్టు ఫుల్‌బెంచికి బదిలీ చేసింది. దీనిపై ఫుల్‌ బెంచి ఒక నిర్ణయాన్ని తీసుకోవలసి ఉన్నది. ఈ నేపథ్యంలో చంద్రబాబు ప్రభుత్వం 13 మంది సిటింగ్‌ జడ్జీలకు వ్యక్తిగతం గానే 600 గజాల చొప్పున రిజిస్టర్‌ చేసినట్టు వార్తలు వచ్చాయి. పైగా రిజిస్ట్రేషన్ల ప్రక్రియ జరిగే నాటికి చంద్రబాబు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి. 2019 ఏప్రిల్‌ 11న ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు జరిగాయి. జడ్జీలకు ఇళ్ల స్థలాల రిజిస్ట్రేషన్లు జరిగింది ఏప్రిల్‌ 24న. గతంలో ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు ‘ఏపీ హైకోర్టు జడ్జెస్‌ మ్యూచువల్లీ ఎయిడెడ్‌ కో–ఆపరేటివ్‌ సొసైటీ’ పేరు మీద భూమిని కేటాయిస్తూ అప్పటి ప్రభుత్వం జీవో విడుదల చేసింది. అయితే న్యాయమూర్తులు సుముఖత వ్యక్తం చేయక పోవడంతో మరో జీవో ద్వారా ఆ కేటాయింపును రద్దు చేసింది. ఇప్పుడు సొసైటీ పేరు మీద కాకుండా వ్యక్తుల పేర్ల మీద కేటా యించిన అంశాన్ని చంద్రబాబే విస్తృత ప్రచారంలోకి తెచ్చారు. ప్రత్యర్థి రాజకీయ పక్షాల వారు ఎవరూ ప్రస్తావించని అంశాన్ని తానే కెలికి అధికార పార్టీ మీద నిందవేయడం ద్వారా న్యాయ వ్యవస్థ సానుభూతి చూరగొనాలని భావించి సెల్ఫ్‌గోల్‌ కొట్టు కున్నట్టు కనిపిస్తున్నది.

జనాభాలో రెండోస్థానం, ఆర్థిక వ్యవస్థల్లో ఐదో స్థానం, అణు పాటవంలో ఆరోస్థానం, అంతరిక్ష విజ్ఞానంలో నాలుగో స్థానంలో ఉన్న భారత్‌ ప్రెస్‌ ఫ్రీడమ్‌ ఇండెక్స్‌లో 142వ స్థానంలో ఉన్నది. ప్రపంచంలోని సుమారు 200 దేశాల్లో అదీ మన స్థానం. ఈ పరిస్థితికి అనేక ఇతర కారణాలు కూడా ఉండవచ్చు. కానీ, న్యాయవ్యవస్థ మీడియా గొంతును నొక్కడం కూడా ఒక ప్రధాన కారణంగానే భావించవలసి ఉంటుంది. మీడియాపై ఏపీ హైకోర్టు జారీచేసిన గ్యాగ్‌ ఆర్డర్‌ను కూడా ఒక ఉదాహరణగా భావించాలి. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో రాజధాని భూసమీకరణ పేరుతో జరిగిన ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌పై వచ్చిన ఫిర్యాదు ఆధారంగా మాజీ అడ్వొకేట్‌ జనరల్‌ దమ్మాల పాటి శ్రీనివాస్‌పై అవినీతి నిరోధక శాఖ తగిన ఆధారాలతో ఎఫ్‌ఐఆర్‌ వేసింది. ఈ ఎఫ్‌ఐఆర్‌లో దమ్మాలపాటి శ్రీనివాస్‌ పేరుతోపాటు సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఇద్దరు కుమార్తెల పేర్లు కూడా ఉన్నట్టు వార్తలు వచ్చాయి. ఈలోగా దమ్మాలపాటి శ్రీనివాస్‌ హైకోర్టులో రిట్‌ పిటిషన్‌ వేశారు. అందులో తనను అరెస్ట్‌ చేయకుండా చూడాలని, తనపై ఎటువంటి దర్యాప్తు జరగకుండా చూడాలనీ, ఒకవేళ దర్యాప్తు చేయవలసి వస్తే హైకోర్టు ఆధ్వర్యంలోనే జరిగేలా చూడాలని పిటిషనర్‌ కోర్టును అభ్యర్థించారు. ఆ సమయానికి ఇంకా ఎఫ్‌ఐఆర్‌ నమోదు కానే లేదు. ఇటువంటి పరిస్థితుల్లో వచ్చే పిటిషనర్ల అభ్యర్థనల్ని ఊహాజనితమైనవిగా భావించి సాధారణంగా కోర్టులు తిరస్క రిస్తూ ఉంటాయి. ఈ పిటిషన్‌ మొదట సింగిల్‌ జడ్జి ముందుకు వచ్చింది. న్యాయమూర్తి ఈ కేసు విచారణకు సుముఖత వ్యక్తం చేయకపోవడంతో ప్రధాన న్యాయమూర్తి ముందుకు వచ్చింది. అప్పటికి మాజీ అడ్వొకేట్‌ జనరల్‌పై కేసు నమోదు చేస్తూ ఎఫ్‌ఐఆర్‌ సిద్ధమైంది. వెంటనే ఆయన హౌస్‌ మోషన్‌ ద్వారా అనుబంధ పిటిషన్‌ వేస్తూ ఎఫ్‌ఐఆర్‌లోని వివరాలను మీడియా ప్రసారం చేయకుండా, ప్రచురించకుండా గ్యాగ్‌ ఆర్డర్‌ ఇవ్వాలని ప్రధాన న్యాయమూర్తిని అభ్యర్థించారు. పిటిషనర్‌ విజ్ఞప్తిని మన్నిస్తూ గ్యాగ్‌ ఆర్డర్‌ను ఇవ్వడమే కాకుండా నమోదైన ఎఫ్‌ఐఆర్‌ ఆధారంగా జరిపే దర్యాప్తుపై స్టేను కూడా ప్రధాన న్యాయమూర్తి ఇచ్చారు. ఇది అసాధారణమైన చర్య అని పలు వురు న్యాయనిపుణులు, విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. భజన్‌ లాల్‌ కేసులో సుప్రీంకోర్టు రూపొందించిన మార్గదర్శకాల ప్రకారం ఎఫ్‌ఐఆర్‌ దాఖలయిన తర్వాత జరిగే దర్యాప్తుపై స్టే ఇవ్వడానికి సాధారణంగా న్యాయస్థానాలు నిర్దిష్ట న్యాయ పరిమి తులకు లోబడి వ్యవహరిస్తాయి.

ఏసీబీ దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను మీడియా ప్రచురిం చరాదనే హైకోర్టు ఉత్తర్వులకు ప్రాతిపదిక ఏమిటి? అలా అయితే ఉన్నత స్థాయిల్లో ఉన్నవారు చేసే తప్పులు ప్రజలకు ఎలా తెలుస్తాయని దేశవ్యాప్తంగా ఉన్న మేధావులు, న్యాయ నిపుణులు, విద్యావేత్తలు ప్రశ్నిస్తున్నారు. ఉత్తర్వులపై ఆశ్చ ర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. విచారణను నిలువరించే అధికారం కోర్టులకు లేదని పలువురు అభిప్రాయపడ్డారు. 1950 నాటి బ్రిజ్‌భూషణ్‌ వర్సెస్‌ ఢిల్లీ రాష్ట్రం మధ్య నడిచిన వ్యాజ్యంలో సుప్రీంకోర్టు పత్రికా స్వేచ్ఛను ప్రాథమిక హక్కుగా గుర్తిస్తూ, పౌరుల వ్యక్తిగత విషయాల గురించి ఏదైనా పబ్లిక్‌ డాక్యుమెంట్‌ ఆధారంతో రాసే కథనాలను ప్రచురించడానికి ఎటువంటి అభ్యంతరాలు పెట్టవలసిన పనిలేదని అభిప్రాయపడింది. మహిళలపై లైంగిక దాడి, కిడ్నాప్‌ వంటి విషయాలు మాత్రం మినహాయింపు. ప్రస్తుత కేసులో ఏసీబీ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ పబ్లిక్‌ డాక్యుమెంట్‌. ఆ డాక్యుమెంట్‌లోని వివరాలు ప్రచురిస్తే, ప్రసారం చేస్తే తప్పేమిటో అర్థం కావడం లేదని పలువురు వ్యాఖ్యానించారు. జనం మెదళ్లలోనూ న్యాయవ్యవస్థ తీరుతెన్నులపై పలురకాల ప్రశ్నలు మొలకెత్తుతున్నాయి. వీటికి లభించబోయే సమాధానాలను బట్టే మన ప్రజాస్వామిక వ్యవస్థ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది.

వర్ధెల్లి మురళి 
muralivardelli@yahoo.co.in

Read latest Guest Columns News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top