అమెరికా అధ్యక్షుడిని ఎలా ఎన్నుకుంటారు?

US Election 2020 Republican Elephant Democratic Donkey Symbols Why - Sakshi

(వెబ్‌ స్పెషల్‌): అమెరికాలో నవంబరు 3న జరుగబోయే అధ్యక్ష ఎన్నిక ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తిస్తోంది. ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌నకు ప్రత్యర్థిగా అధ్యక్ష పదవి కోసం జో బిడైన్‌ ఎన్నికల బరిలో నిలిచారు. ఇరు వర్గాలు ఇప్పటికే ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతూ స్థానిక ఓటర్లతో పాటుగా.. అమెరికాలో ఓటు హక్కు కలిగిన ఇండో- అమెరికన్లు, శ్వేతజాతీయేతర ప్రజల మద్దతు కూడగట్టుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వీరిద్దరి గెలుపు అవకాశాలపై ఇప్పటికే రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. అంతేగాకుండా ప్రపంచానికి ‘పెద్దన్న’గా వెలుగొందుతున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితం కోసం దాని మిత్రదేశాలతో పాటుగా, ‘శత్రు’ దేశాలు కూడా అంతే ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి. ఇంతటి ప్రాముఖ్యం కలిగిన అగ్రరాజ్య అధ్యక్షుడి ఎన్నిక విధానం, పోటీ పడేందుకు అర్హతలు, ప్రధాన పార్టీలు, ట్రంప్‌, జో బిడైన్‌లతో పాటుగా పోటీలో నిలిచిన మరికొందరు అభ్యర్థుల గురించి కొన్ని వివరాలు..

అధ్యక్ష పదవికి అర్హతలు
అమెరికా రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 2 ప్రకారం అధ్యక్ష పదవికి పోటీచేసే వ్యక్తి అమెరికాలో జన్మించిన పౌరులై ఉండాలి. కనీసం 35 ఏళ్ల వయసు కలిగి ఉండటంతో పాటుగా 14 ఏళ్ల పాటు అక్కడే నివసించి ఉండాలి. వివిధ రాజకీయ పార్టీల నుంచి అభ్యర్థిత్వాన్ని ఆశించే వారు తొలుత పార్టీకి సంబంధించిన ప్రాథమిక ఎన్నికల్లో గెలుపొంది తీరాలి. ఇవి పరోక్ష పద్ధతిలో నిర్వహిస్తారు. ఇందులో విజయం సాధించిన వారిని ఆయా పార్టీల తరఫున అధ్యక్ష పదవికి అర్హులుగా పరిగణిస్తారు. అదే సమయంలో ఉపాధ్య పదవికి పోటీ చేసే రన్నింగ్‌ మేట్‌ను సదరు అభ్యర్థి ఎంచుకుంటారు.

ఇక 1951లో జరిగిన 12 వ రాజ్యాంగ సవరణ ప్రకారం వైస్‌ ప్రెసిడెంట్‌గా పోటీ చేసే అభ్యర్థికి సైతం అధ్యక్ష అభ్యర్థికి పోటీపడే వ్యక్తికి ఉండే అర్హతలు ఉండాలి. ప్రస్తుత ఎన్నికల్లో రిపబ్లికన్‌ పార్టీ తరఫున డొనాల్డ్‌ ట్రంప్‌, డెమొక్రటిక్‌ పార్టీ నుంచి జో బిడైన్‌ పోటీ చేస్తున్నారు. బిడెన్‌ తన రన్నింగ్‌ మేట్‌గా ఆసియా- ఆఫ్రికా మూలాలు ఉన్న కమలా హారిస్‌ పేరు ప్రకటించగా.. ప్రస్తుత ఉపాధ్యక్షుడు మైక్‌ పెన్స్‌ వైపే ట్రంప్‌ మరోసారి మొగ్గు చూపే అవకాశం ఉంది.(చదవండి: ఇంతవరకు ఎవరికీ ఆ ఛాన్స్‌ రాలేదు!)

అధ్యక్ష ఎన్నిక విధానం
అమెరికా అధ్యక్ష ఎన్నిక పరోక్ష పద్ధతిలో జరుగుతుంది. వాషింగ్టన్‌ డీసీ, అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో(50) పేర్లు నమోదు చేసుకున్న ఓటర్లు ఎలక్టోరల్‌ కాలేజీ సభ్యులను ఎన్నుకుంటారు. వీరిని ఎలక్టర్లు అంటారు. వీరే అమెరికా అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడిని పరోక్ష పద్ధతిలో ఎన్నుకుంటారు. ఎలక్టోరల్‌ కాలేజీలో 538 సభ్యులు ఉంటారు. వీరిలో సగం కంటే ఎక్కువ మంది ఓట్లు అంటే కనీసంగా 270 గెలుచుకున్న అభ్యర్థులే అధ్యక్ష పదవికి ఎన్నికవుతారు. ఇక ఒక్కొక్క రాష్ట్రానికి కేటాయించే ఎలక్టర్ల సంఖ్య ఆ రాష్ర్టం నుంచి కాంగ్రెస్‌(అమెరికా పార్లమెంటు)లోని ఉభయ సభలకు ఎన్నికయ్యే సభ్యులతో సమానంగా ఉంటుంది. 

ఒకవేళ ఎన్నికలో ఏ అభ్యర్థి సరిపడా ఓట్లు సాధించలేకపోతే.. కాంగ్రెస్ దిగువ సభ అయిన హౌజ్‌ ఆఫ్‌ రిప్రజంటేటివ్స్‌(ప్రతినిధుల సభ) అధ్యక్షుడిని ఎంపిక చేస్తుంది. అలాగే ఉపాధ్యక్షుడి ఎన్నికలోనూ ఇదే తరహా పరిస్థితి తలెత్తితే ఎగువ సభ ‘సెనేట్’ ఉపాధ్యక్షుడిని ఎంపిక చేస్తుంది. ప్రతినిధుల సభ అధ్యక్షుడిని ఎన్నుకునే ప్రక్రియలో ప్రతి.. ‘‘రాష్ట్రానికి ఒక ఓటు’’ ఉంటుంది. అదే విధంగా సెనెట్ ఉపాధ్యక్షుడిని ఎన్నుకోవాల్సి వస్తే ప్రతి సెనెటర్‌కు ఒక ఓటు ఉంటుంది. అయితే గతంలో ఒకటి రెండుసార్లు మినహా ఇలాంటి పరిస్థితి ఎప్పుడూ తలెత్తలేదు.(చదవండి: అమెరికా ఎన్నికల్లో మన ప్రధాని మోదీ!)


ఏనుగు లేదా గాడిద.. ఎవరిది పైచేయి?
1776 నుంచి రెండు ప్రధాన రాజకీయ పక్షాలకు చెందిన వారే అమెరికా అధ్యక్షులుగా ఎన్నికవుతూ వస్తున్నారు. అవే కాలక్రమంలో రూపాంతరం చెంది ప్రస్తుతం డెమొక్రటిక్, రిపబ్లికన్ పార్టీలుగా వ్యవహారంలో ఉన్నాయి. గత కొన్ని దశాబ్దాలుగా ఈ రెండు పార్టీలే అమెరికా రాజకీయ ముఖచిత్రంగా మారిపోయాయి. సంప్రదాయ భావాలు గల రిపబ్లికన్‌ పార్టీ చిహ్నంగా ఏనుగు, వామపక్ష భావజాలం కలిగిన డెమొక్రటిక్‌ పార్టీ  చిహ్నంగా గాడిద స్థిరపడటం వెనుక ఓ చరిత్ర దాగి ఉంది. 

1828 అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి జాన్ ఆడమ్స్.. తన ప్రత్యర్థి ఆండ్రూ జాక్సన్‌ను గాడిదగా అభివర్ణించారు. ఆయన అభిప్రాయాలు, ఆలోచనలు అర్థంపర్థం లేనివి అంటూ విమర్శించారు. అయితే జాక్సన్‌ మాత్రం ఈ విమర్శను తనకు అనుకూలంగా మలచుకున్నారు. గాడిద అంటే విశ్వాసానికి, ఎంతటి బరువు మోయడానికైనా సిద్ధపడుతుందంటూ ప్రచారంలో మరింత దూకుడు పెంచారు. ఇదిలా ఉంటే 1864 ఎన్నికల్లో రిపబ్లికన్‌ పార్టీ తరఫున పోటీ చేసిన అబ్రహం లింకన్‌కు మద్దతుగా  ఇల్లినాయిస్‌కు చెందిన ఓ వార్తాపత్రిక.. ప్రచారంలో భాగంగా.. అంతకుముందు జరిగిన అంత్యర్దుద్ధంలో అప్పటి యూనియన్‌ ప్రభుత్వ విజయాలను ప్రస్తావిస్తూ ‘ఏనుగు’ను బలానికి, పోరాట పటిమకు నిదర్శనంగా పేర్కొంటూ ఆ గుర్తుకు ప్రచారం కల్పించింది. 

ఇక ఈ పరిణామాలతో పాటు .. కార్టూనిస్ట్‌ అయిన థామస్‌ నాస్ట్‌ అనే రిపబ్లికన్‌.. గాడిద, పులి చర్మం కప్పుకొని ఇతర జంతువులను భయపెట్టినట్లు, అయితే వాటిలో కేవలం ఏనుగు మాత్రమే ధైర్యంగా దానికెదురు నిలబడినట్లు తన కార్టూన్లలో చిత్రీకరించారు. దీంతో ఇటు డెమొక్రటిక్‌ పార్టీకి గాడిద, రిపబ్లికన్‌ పార్టీకి ఏనుగు చిహ్నాలుగా ప్రజా బాహుళ్యంలో ప్రాచుర్యం పొందాయి. ఇక మరోసారి ‘ఏనుగు’ తరఫున ప్రాతినిథ్య వహిస్తున్న ట్రంప్‌, గాడిద చిహ్నంతో బరిలో దిగిన జో బిడైన్‌లలో ఎవరు పైచేయి సాధిస్తారో చూడాలంటే ఇంకొన్నాళ్లు వేచి చూడాల్సిందే.

థర్డ్‌పార్టీ అభ్యర్థులు..
ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు ఈసారి థర్డ్‌పార్టీ, స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ పడుతున్న ప్రముఖుల వివరాలు ఇలా ఉన్నాయి. అయితే థర్డ్‌పార్టీ అభ్యర్థులెవరూ ఇంతవరకు జరిగిన ఎన్నికల్లో అంతగా ప్రభావం చూపిన దాఖలాలు లేవు.

Read latest International News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top