సుశాంత్‌ వాళ్ల వైపే మొగ్గుచూపాడు.. అందుకే

Anurag Kashyap Says Parineeti Chopra Refused to Work Sushanth - Sakshi

పరిణీతి చోప్రా తనతో నటించను అని చెప్పింది

ఆ తర్వాత వాళ్లిద్దరూ మళ్లీ కలిసి నటించారు

అనురాగ్‌ కశ్యప్‌ వ్యాఖ్యలు

ముంబై: బాలీవుడ్‌ బడా నిర్మాత కరణ్‌ జోహార్‌, వికాస్‌ బల్‌ తదితరులతో కలిసి తాను నిర్మించిన ‘హసీ థో ఫసీ’ సినిమాలో తొలుత సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌నే హీరోగా ఎంపిక చేశామని ఫిల్మ్‌ మేకర్‌ అనురాగ్‌ కశ్యప్‌ అన్నాడు. అయితే పెద్ద బ్యానర్‌లో అవకాశం రావడంతో అతడు ఈ మూవీని వదులుకున్నాడని చెప్పుకొచ్చాడు. అంతేతప్ప తాము అతడిని కావాలని పక్కకు పెట్టామన్న వార్తల్లో నిజం లేదని కొట్టిపడేశాడు. అయితే హీరోయిన్‌ పరిణీతి చోప్రా వల్లే సుశాంత్‌కు బడా నిర్మాణ సంస్థలో పనిచేసే అవకాశం వచ్చి ఉండవచ్చని అభిప్రాయపడ్డాడు.

కాగా సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ మృతి నేపథ్యంలో బాలీవుడ్‌లో నెపోటిజం గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. బంధుప్రీతి కారణంగానే సుశాంత్‌ వంటి ప్రతిభ గల నటులకు అన్యాయం జరుగుతుందంటూ అతడి ఫ్యాన్స్‌ విరుచుకుపడుతున్నారు. ఈ క్రమంలో అనురాగ్‌ కశ్యప్‌ కూడా సుశాంత్‌తో కలిసి పనిచేసేందుకు ఇష్టపడలేదంటూ పలువురు కామెంట్లు చేశారు. (చదవండిసాయం చేయండి: మోదీకి పాయల్‌‌ ట్వీట్‌)

ఈ నేపథ్యంలో ఓ ప్రముఖ జర్నలిస్టుతో మాట్లాడిన దర్శక- నిర్మాత అనురాగ్‌ కశ్యప్‌.. ‘‘నిజానికి సుశాంత్‌ హసీ థో ఫసీ సినిమా చేయాల్సింది. అతడిని హీరోగా అనుకోగానే, హీరోయిన్‌ కోసం వెదుకులాట మొదలుపెట్టాం. అలా పరిణీతి చోప్రాను సంప్రదించాం. అయితే అప్పటికి సుశాంత్‌ టీవీ నటుడిగా ఉండటంతో ఆమె ఈ ఆఫర్‌ను తిరస్కరించింది. సీరియల్‌ నటుడితో కలిసి పనిచేయలేనంది. అప్పుడు మేమే తనకు అర్థమయ్యేలా చెప్పాం. సుశాంత్‌ కాయ్‌ పో చే, పీకే వంటి సినిమాలు చేస్తున్నాడని, మన సినిమా విడుదలయ్యే సమయానికి తనొక వెండితెర నటుడిగా ఉంటాడని చెప్పాం. అయితే అప్పటికే తను శుద్ధ్‌ దేశీ రొమాన్స్‌ సినిమా చేస్తోంది. 

నాకు తెలిసి తనే సుశాంత్‌ గురించి యశ్‌రాజ్‌ ఫిల్మ్స్‌తో మాట్లాడి ఉంటుంది. అప్పుడు వాళ్లు అతడిని పిలిచి.. ‘‘నువ్వు మా సినిమాలో నటించవచ్చు కదా. ఆ సినిమా వదిలెయ్‌’’అని చెప్పారు. అప్పుడు తను వాళ్లవైపే మొగ్గుచూపాడు’’అని పేర్కొన్నాడు. ఆ తర్వాత పరిణీతి చోప్రా- సిద్ధార్థ్‌ మల్హోత్రా ప్రధాన పాత్రల్లో హసీ థో ఫసీ తెరకెక్కించినట్లు చెప్పుకొచ్చాడు. 2016లో తాను సుశాంత్‌కు మరో ఆఫర్‌ ఇచ్చానని, అయితే ఆ ప్రాజెక్టు వర్కౌట్‌ కాలేదని తెలిపాడు. ఇదిలా ఉండగా.. నటి పాయల్‌ ఘోష్‌ అనురాగ్‌ కశ్యప్‌పై ఇటీవల లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన నేపథ్యంలో ఆయనపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్న సంగతి తెలిసిందే. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top