బిగ్‌బాస్‌: అనారోగ్యంతో ఏడ్చేసిన గంగవ్వ

Bigg Boss 4 Telugu: Gangavva Cries And Sick In House - Sakshi

బుల్లితెర బాస్ బిగ్‌బాస్ రియాలిటీ షోలో నేడు వైల్డ్‌కార్డ్ ఎంట్రీ కంటెస్టెంట్‌గా ముక్కు అవినాష్ హౌస్‌లో ఎంట‌ర‌య్యాడు. వినూత్న ఎంట్రీతో హౌస్‌లో అడుగుపెట్టి అంద‌రినీ స‌ర్‌ప్రైజ్ చేశాడు. మ‌ట్టి మ‌నిషి గంగ‌వ్వ‌కు ఏసీ గ‌దుల్లో రోజుల త‌ర‌బ‌డి ఉండ‌టం క‌ష్టంగా ఉంది. ఆ వాతావార‌ణం, అక్క‌డి తిండి త‌న ఒంటికి ప‌డ‌క అస్వ‌స్థ‌త‌కు లోనైంది. దీంతో ఆమెను వైద్యుల ద‌గ్గ‌ర‌కు పంపించారు. మ‌రి నేటి ఎపిసోడ్ హైలెట్స్ ఏంటో చూసేద్దాం..

ఈ రోజు.. నా రోజు: అవినాష్ ఎంట్రీ
ప‌ద‌కొండో రోజు ఉద‌యం పాట‌కు బ‌దులు వాయిస్ ఓవర్‌తోనే నిద్ర లేచారు. ఈ రోజు.. నా రోజు అంటూ ముక్కు అవినాష్ ఇంట్లోకి రాక‌ముందే ఇంటి స‌భ్యులపై జోకులు పేల్చాడు. జోక‌ర్‌.. ఆనందానికి, బాధ మ‌ధ్య న‌లిగిపోతూ ఉండే చిన్న ప‌దం, జోక‌ర్ వెన‌క జీవిత‌మే ఉంది అంటూ ఏవీ చూపించారు. ఆ త‌ర్వాత‌ అంద‌ర్నీ న‌వ్వించే జోక‌ర్‌గా వ‌చ్చాను అంటూ అవినాష్ గ్రాండ్‌ ఎంట్రీ ఇచ్చాడు. వ‌చ్చీరాగానే త‌న‌కు పెద్ద కుటుంబం ఉంద‌ని, త‌న గురించి ఆలోచించంటూ మోనాల్ ద‌గ్గ‌ర పెళ్లి అప్లికేష‌న్ పెట్టుకున్నాడు. ఆ త‌ర్వాత ఇంటి స‌భ్యులు స‌ర‌దాగా క‌ళ్యాణిని బ‌య‌ట‌పెట్టాల‌నుకున్న ప్లాన్ అట్ట‌ర్‌ప్లాఫ్ అయింది. (చ‌ద‌వండి: బిగ్‌బాస్‌: ఎలిమినేష‌న్, ఆ వెంట‌నే స‌ర్‌ప్రైజ్‌)

గుక్కపెట్టి ఏడ్చిన సుజాత‌, బుజ్జ‌గించిన నోయ‌ల్‌
కానీ సుజాత‌ను మాత్రం నోయ‌ల్‌ విజయ‌వంతంగా బ‌య‌ట‌పెట్టాడు. ఆ భ‌యం నుంచి బ‌య‌ట‌ప‌డ‌ని సుజాత గుక్క‌పెట్టి మ‌రీ ఏడ్చింది. దీంతో నోయ‌ల్ ఆమెను ద‌గ్గ‌ర తీసుకుని ఊర‌డించాడు. అనంత‌రం పెద్ద బిల్డ‌ప్ ఇచ్చిన‌ అవినాష్‌తో ఇంటి స‌భ్యులు ఓ ఆటాడుకున్నారు. అత‌డిని అమ్మాయిగా రెడీ చేసి గంగ‌వ్వ‌తో క‌లిసి ర్యాంప్ వాక్ చేయించారు. ఇదిలా వుంటే ట్రూత్ ఆర్ డేర్ గేమ్‌లో భాగంగా ఇంట్లో ఉండే ఒక అబ్బాయిని  నువ్వుసెల‌క్ట్ చేసుకోవాలి అని హారిక‌ సుజాత‌ను అడిగింది. అంద‌రూ అక్క‌, త‌మ్ముడు అవుతారు, పోనీ అభి పేరు చెప్తావా అనగానే అత‌డు ఛీఛీ సుజాత నాకు చెల్లి అని అన్నాడు. చీచీ అన్నందుకు సుజాత నొచ్చుకుంది. ఆ విష‌యాన్ని చెప్తూ ప‌దేప‌దే ఏడ్చింది.

పంటి కింద నొప్పిని భ‌రిస్తున్న గంగ‌వ్వ‌
గ‌త కొద్దిరోజులుగా పంపించండ‌ని వేడుకుంటున్న‌ గంగ‌వ్వ అనారోగ్యం బారిన ప‌డింది. దీంతో బిగ్‌బాస్ ఆమెను క‌న్ఫెష‌న్ రూమ్‌లోకి పిలిచాడు. ఆరోగ్యం ఎలా ఉంద‌ని అడిగాడు. అంద‌రూ బాగానే చూసుకుంటున్నారు, కానీ భ‌ర్త కొట్టిన దెబ్బ‌లు ఇప్పుడు మ‌ళ్లీ  నొప్పెడుతున్నాయ‌ని చెప్పింది. నాకిక్క‌డ వాతావార‌ణం, ఆహారం ప‌డ‌త‌లేద‌ని ఏడుస్తూ గోడు వెల్ల‌బోసుకుంది. మ‌ట్టిలో తిరిగేదాన్ని, ఇక్క‌డ ఉండ‌లేక‌పోతున్నాన‌ని చెప్పింది. రెండు నెల‌లు ఉందామ‌నే వ‌చ్చాను, కానీ త‌న వ‌ల్ల కావ‌ట్లేదంటూ క‌న్నీళ్లు పెట్టుకుంది. (చ‌ద‌వండి: నాకైతే రెమ్యూన‌రేష‌న్ చాలానే ఇచ్చారు)

వైద్యుల‌తో గంగ‌వ్వకు చికిత్స‌
మీరు గ‌ట్టిమ‌నిషి, ఇలాంటి ఎన్నో క‌ష్టాలను చూసి ఇక్క‌డిదాకా వ‌చ్చారు అని బిగ్‌బాస్ ధైర్యం నూరిపోసే ప్ర‌య‌త్నం చేసిన‌‌ప్ప‌టికీ ఆమె ఇక్క‌డ ఉండ‌లేక‌పోతున్నా అని ప‌రోక్షంగా పంపించేయండ‌ని ప‌దేప‌దే చెప్పింది. బిగ్‌బాస్‌ ఆమెను మెడిక‌ల్ రూమ్‌కు వెళ్ల‌మ‌ని చెప్పి అక్క‌డ వైద్యుల‌తో చికిత్స అందించారు. ఇప్ప‌టివ‌ర‌కు గంగ‌వ్వ‌ను గెలిపిద్దాం అనుకున్న అభిమానులు నేటి ఎపిసోడ్ చూశాక మ‌న‌సు మార్చుకుంటున్నారు. ఆమె ప‌డుతున్న‌ అవ‌స్థ‌ను క‌ళ్లారా చూసిన త‌ర్వాత ఆమెను ఇంక ఇంటికి పంపించేయ‌డ‌మే బెట‌ర్ అంటున్నారు. ఇదిలా వుంటే రేప‌టి ఎపిసోడ్‌లో బీబీ కామెడీ షో జ‌ర‌గ‌నుంది. ఇందులో రెండు టీమ్‌లుగా విడిపోయిన‌ అవినాష్‌, అమ్మ రాజ‌శేఖ‌ర్ కామెడీ స్కిట్లు చేయ‌నున్నారు. వీరిలో ఎవ‌రి కామెడీ పండనుందో చూడాలి. ఇక్క‌డ రియ‌ల్ జోక‌ర్ గెలుస్తాడా? రీల్ జోక‌ర్ విజ‌యం సాధిస్తాడా? అనేది ఆస‌క్తిక‌రంగా మారింది. (చ‌ద‌వండి: బిగ్‌బాస్‌: కెప్టెన్ లాస్య‌కు మాస్ట‌ర్ పంచ్‌)

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top