భారత్, చైనా సుదీర్ఘ చర్చలు

న్యూఢిల్లీ: సరిహద్దుల్లో కొనసాగుతున్న ప్రతిష్టంభన నేపథ్యంలో భారత్, చైనాల మధ్య చర్చలు సుదీర్ఘంగా కొనసాగుతున్నాయి. చైనా భూభాగంలోని మోల్డోలో ఉదయం 9 గంటల ప్రాంతంలో మొదలైన ఆరో విడత చర్చలు రాత్రి 9 గంటల తర్వాత కూడా ఒక కొలిక్కి రాలేదు. రెండు దేశాల మధ్య కుదిరిన ఐదు అంశాల ఒప్పందం అమలే లక్ష్యంగా జరుగుతున్న ఈ చర్చల్లో భారత్ తరఫున లెఫ్టినెంట్ జనరల్ హరీందర్ సింగ్‌తోపాటు మొదటిసారిగా విదేశాంగ శాఖ తరఫున జాయింట్ సెక్రటరీ నవీన్ శ్రీవాస్తవ కూడా పాల్గొన్నారు.
ఈ నెల 10వ తేదీన మాస్కోలో రెండు దేశాల విదేశాంగ మంత్రుల మధ్య కుదిరిన ఒప్పందంలోని ఐదు అంశాల అమలుకు కాలపరిమితిని ఖరారు చేయడంపైనే భారత బృందం దృష్టి పెట్టిందని అధికార వర్గాలు తెలిపాయి. ముఖ్యంగా ఘర్షణాత్మక ప్రాంతాల్లో మోహరించిన చైనా బలగాలను సాధ్యమైనంత త్వరలో, పూర్తిగా వెనక్కి తీసుకోవాలని ఈ బృందం కోరుతోంది. ఇప్పటి వరకు జరిగిన ఐదు దఫాలుగా సుదీర్ఘ చర్చలు జరిగినా చెప్పుకోదగ్గ పురోగతి ఏమీ లేకుండానే ముగిసిన విషయం తెలిసిందే.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి