ఉద్యోగ సృష్టికర్తలొస్తారు..

PM Narendra Modi To Address Smart India Hackathon 2020 - Sakshi

130 కోట్ల మందికిపైగా ప్రజల ఆకాంక్షలకు ప్రతిరూపం 

‘స్మార్ట్‌ ఇండియా హ్యాకథాన్‌’లో ప్రధాని మోదీ ప్రసంగం

న్యూఢిల్లీ: ఉద్యోగాల కోసం ఎదురు చూసేవాళ్లు కాదు.. ఉద్యోగాలు ఇచ్చేవాళ్లను తయారు చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం నూతన విద్యా విధానం–2020ని ప్రకటించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. దేశంలో విద్యా వ్యవస్థను  ప్రక్షాళన చేయాలని ప్రభుత్వం సంకల్పించిందన్నారు. శనివారం స్మార్ట్‌ ఇండియా హ్యాకథాన్‌ కార్యక్రమంలో విద్యార్థులను ఉద్దేశించి ప్రధాని మోదీ మాట్లాడారు. విద్యార్థి ఏం నేర్చుకోవాలని కోరుకుంటున్నాడో అదే అందించడం కొత్త విద్యా విధానంలో భాగంగా ఉంటుందని వెల్లడించారు.

ఇది కేవలం ఒక విధాన పత్రం కాదని, 130 కోట్ల మందికిపైగా ప్రజల ఆకాంక్షలకు ప్రతిరూపం అని పేర్కొన్నారు. ‘ఇష్టం లేని సబ్జెక్టులను తమపై బలవంతంగా రుద్దుతున్నారని చాలామంది విద్యార్థులు భావిస్తున్నారు. ఆసక్తి లేని చదువులు చదవాలని వారిపై మిత్రులు, కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిడి పెరుగుతోంది. దీనివల్ల విద్యార్థులు అక్షరాస్యులు అవుతారేమో గానీ వారికి ఉపయోగం మాత్రం ఉండదు. డిగ్రీలు సంపాదించినప్పటికీ ఆత్మవిశ్వాసం కొరవడుతుంది.

ఇది వారి జీవితంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. ఈ పరిస్థితిని సమూలంగా మార్చేయడమే నూతన విద్యా విధానం ఉద్దేశం’ అని మోదీ ఉద్ఘాటించారు.   స్మార్ట్‌ ఇండియా హ్యాకథాన్‌ నాలుగో ఎడిషన్‌ను కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ నిర్వహించింది. ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు ఎదుర్కొంటున్న సాంకేతిక సమస్యలకు విద్యార్థులు పరిష్కార మార్గాలు చూపడమే దీని ఉద్దేశం. ఈ ఏడాది 243 సమస్యల పరిష్కారానికి 10 వేల మందికిపైగా పోటీపడ్డారు. విజేతలకు నగదు బహుమతి అందజేశారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top