రాజ్యసభ రగడ : విపక్ష ఎంపీల సస్పెన్షన్

Venkaiah Naidu suspended Eight members From Rajya Sabha - Sakshi

 8 మంది సభ్యులపై సస్పెన్షన్ 

సభాసాంప్రదాయాలను సభ్యులు పాటించలేదు: వెంకయ్యనాయుడు

సాక్షి, న్యూఢిల్లీ : వ్యవసాయ బిల్లులపై ఓటింగ్‌ సందర్భంగా పార్లమెంట్‌లో ఆదివారం చోటుచేసుకున్న గందోరగోళంపై రాజ్యసభ చైర్మన్‌ వెంకయ్య నాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సభ హక్కుల మర్యాదలకు భంగం కలిగించే విధంగా విపక్ష సభ్యులు వ్యవహరించారని మండిపడ్డారు. రాజ్యసభలో ఘర్షణ పూరితమైన వాతావరణాన్ని కల్పించి డిప్యూటీ చైర్మన్‌ విధులకు ఆటంకం కలిగించారని సభ్యుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. సభ నిబంధనలకు విరుద్ధంగా వ్యహరించారని గందరగోళానికి కారణమైన ఎంపీలపై చర్యలు తీసుకున్నారు. ఎనిమిది మంది సభ్యులపై సస్పెన్షన్ వేటు వేశారు. ఈ మేరకు విపక్ష ఎంపీలపై అధికార పార్టీ సభ్యులు ప్రవేశపెట్టిన తీర్మానానికి వెంకయ్యనాయుడు సోమవారం ఆమోదం తెలిపారు. సస్పెన్షన్‌కు గురైన ఎంపీల్లో సంజయ్‌సింగ్ (ఆప్), డెరికో ఓబ్రెన్ (టీఎమ్‌సీ), డోలాసేన్ (టీఎమ్‌సీ), రాజీవ్ వాస్తవ్‌ (కాంగ్రెస్) , రిపూన్ బోరా (కాంగ్రెస్) సయ్యద్ నజీర్ హుస్సేన్ (కాంగ్రెస్) , కరీం (సీపీఎం), కేకే రాజేష్ ( సీపీఎం)లో ఉన్నారు. (సాగు బిల్లులకు పార్లమెంటు ఓకే)

సభాసాంప్రదాయాలను సభ్యులు పాటించలేదని సభ నుంచి సస్పెండ్‌ చేస్తున్నట్లు వెంకయ్య నాయుడు ప్రకటించారు. వారం రోజుల పాటు ఈ తీర్మానం అమల్లో ఉండనుంది. మరోవైపు చైర్మన్‌ నిర్ణయంపై విపక్ష పార్టీ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతులకు పెద్ద ఎత్తున నష్టం చేకూరుస్తున్న బిల్లులపై కనీసం మాట్లాడటానికి అవకాశం ఇవ్వనందునే తాము నిరసన వ్యక్తం చేశామని చెబుతున్నారు. ఆదివారం బిల్లులపై ఓటింగ్‌ సందర్భంగా సభలో గందరగోళం నెలకొన్న విషయం తెలిసిందే. వ్యవసాయ బిల్లులకు వ్యతిరేకంగా విపక్ష సభ్యులు ఉపసభాపతి స్థానం వద్దకు వెళ్లి రైతు వ్యతిరేక ప్రభుత్వమంటూ నినాదాలు చేశారు. టీఎంసీ సభ్యుడు డెరెక్‌ ఓబ్రీన్‌ ఆగ్రహంతో డిప్యూటీ చైర్మన్‌ స్థానం వద్దకు దూసుకువెళ్లారు. రూల్‌ బుక్‌ను ఆయన ముఖంపై విసిరేశారు. (పెద్దల సభలో పెను దుమారం)

సభాపతి స్థానం వద్ద ఉన్న మైక్రోఫోన్‌ను లాగేసేందుకు ప్రయత్నించగా, మార్షల్స్‌ అడ్డుకున్నారు. బిల్లులను సెలెక్ట్‌ కమిటీకి పంపించాలని తీర్మానాలను ప్రతిపాదించిన డీఎంకే సభ్యుడు తిరుచి శివ, టీఎంసీ సభ్యుడు డెరెక్‌ ఓబ్రీన్, కాంగ్రెస్‌ ఎంపీ కేసీ వేణుగోపాల్, సీపీఎం సభ్యుడు కేకే రాగేశ్‌.. తదితరులు బిల్లు పేపర్లను చింపి గాల్లోకి విసిరేశారు. దీంతో సభ్యుల తీరుపై పార్లమెంట్‌ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపసభాపతిని అగౌరపరిచే విధంగా వ్యవహరించిన సభ్యులను సస్పెండ్‌ చేయాలని ఫిర్యాదు చేశారు. ఈ మేరకు రాజ్యసభలో ఓ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. దీనికి సోమవారం సభాకార్యక్రమాలు తిరిగి ప్రారంభం అయిన వెంటనే వెంకయ్య నాయుడు ఆమోదం తెలిపారు.

డిప్యూటీ చైర్మన్‌పై అవిశ్వాస తీర్మానం
మరోవైపు డిప్యూటీ చైర్మన్‌ హరివంశ్‌పై విపక్షాలు ఇచ్చిన అవిశ్వాస తీర్మానం నోటీస్‌ను రాజ్యసభ చైర్మన్ వెంకయ్య నాయుడు తిరస్కరించారు. 12 పార్టీలు కలిసి 50 మంది ఎంపీల సంతకాలతో అవిశ్వాస తీర్మానం నోటీస్‌ను ఇచ్చారు. డిప్యూటీ చైర్మన్‌పై అవిశ్వాస తీర్మానం నోటీస్ ఆమోదయోగ్యం కాదన్న చైర్మన్.. దానిని తిరస్కరించారు.

 

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top