మాణిక్యం ‘మార్కు’

Manikyam Tagore who was appointed in-charge of Congress Party was started showing his mark - Sakshi

బాధ్యతలు తీసుకోకుండానే కోర్‌ కమిటీ మీటింగ్‌ పెట్టిన రాష్ట్ర కాంగ్రెస్‌ ఇన్‌చార్జి 

రాష్ట్ర నేతల మధ్య అనైక్యతను ఎత్తి చూపుతూ దిశానిర్దేశం 

తెలంగాణ కాంగ్రెస్‌లో సచిన్, ధోనీలున్నారు.. కలసికట్టుగా ఆడితేనే విజయం

క్రమశిక్షణ తప్పితే ఊరుకునేది లేదు.. సోషల్‌ మీడియా పోస్టింగులపై సీరియస్‌ 

కేసీఆర్‌ పాలనకు స్వస్తి పలకడమే లక్ష్యంగా పనిచేయాలి 

దుబ్బాక, జీహెచ్‌ఎంసీ ఎన్నికలకు కార్యాచరణ  

సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జిగా నియమితులైన మాణిక్యం ఠాగూర్‌ తన మార్కు చూపెట్టడం మొదలుపెట్టారు. ఇన్‌చార్జిగా బాధ్యతలు తీసుకోకుండానే టీపీసీసీ కోర్‌ కమిటీ సమావేశం నిర్వహించి తనను అధిష్టానం తెలంగాణకు ఎందుకు పంపిందో తెలిసేవిధంగా రాష్ట్ర నాయకత్వానికి సంకేతాలను పంపారు. బుధవారం జూమ్‌ యాప్‌ ద్వారా దాదాపు 3 గంటలకుపైగా సాగిన ఈ సమావేశంలో ఆయన పలు సూచనలు చేశారు. రాష్ట్ర కాంగ్రెస్‌లో సచిన్, ధోని లాంటి క్రీడాకారులున్నారని, కానీ, కలిసికట్టుగా ఆడి, ఎవరి పాత్ర వారు పోషిస్తేనే క్రికెట్‌ మ్యాచ్‌లో గెలుస్తామన్న విషయాన్ని గుర్తెరగాలన్నారు.

రాజకీయాలంటే టెన్నిస్‌ లాగా వ్యక్తిగతంగా ఆడే ఆట కాదని, క్రికెట్‌ లాగా సమష్టిగా కృషి చేయాలని హితవు పలికారు. 2023 ఎన్నికల్లో కేసీఆర్‌ పాలనకు స్వస్తి పలకడమే లక్ష్యంగా పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. దుబ్బాక ఉప ఎన్నిక, మండలి ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా అభ్యర్థులను త్వరగా ఎంపిక చేసి కార్యరంగంలోకి దిగాలని సూచించారు. జీహెచ్‌ఎంసీ, వరంగల్, ఖమ్మం కార్పొరేషన్లలో బూత్, బ్లాక్‌స్థాయి కమిటీలను వెంటనే ఏర్పాటు చేసి తనకు పంపాలని కోరారు. త్వరలో ప్రారంభం కానున్న పార్టీ సభ్యత్వ కార్యక్రమాన్ని కూడా సీరియస్‌గా తీసుకోవాలని రాష్ట్ర నాయకత్వాన్ని కోరారు.  

పార్టీ నేతలను పరిచయం చేసిన ఉత్తమ్‌ 
కోర్‌ కమిటీ సమావేశానికి ఉత్తమ్‌తోపాటు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, సీఎల్పీ మాజీ నేత కె.జానారెడ్డి, పార్టీ ఎంపీలు ఎ.రేవంత్‌ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఏఐసీసీ ఇన్‌చార్జి కార్యదర్శులు బోసురాజు, శ్రీనివాస కృష్ణన్, టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్లు పొన్నం ప్రభాకర్, జెట్టి కుసుమ కుమార్, కోర్‌ కమిటీ సభ్యులు దామోదర రాజనర్సింహ, షబ్బీర్‌ అలీ, పొన్నాల లక్ష్మయ్య, వి.హనుమంతరావు, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి, ఎమ్యెల్యేలు శ్రీధర్‌ బాబు, సీతక్క, జగ్గారెడ్డి, ఏఐసీసీ కార్యదర్శులు చిన్నారెడ్డి, మధుయాష్కీ గౌడ్, వంశీ చంద్‌ రెడ్డి, సంపత్‌ కుమార్‌ పాల్గొన్నారు. 

మాణిక్‌.. ‘భాషా’ 
రాష్ట్ర పార్టీ వ్యవహారాలపై అధ్యయనం చేసినట్టు కనిపించిన మాణిక్యం పలు విలువైన సూచనలతోపాటు హెచ్చరికలు కూడా చేశారు. కట్టు తప్పితే సహించేది లేదని, సోషల్‌ మీడియాను పార్టీ లైన్‌ ప్రకారమే ఉపయోగించుకోవాలి తప్ప ఇష్టానుసారంగా, వ్యక్తిగతంగా ఉపయోగించుకోవద్దని సూచించారు. ప్రతి 15 రోజులకోసారి కోర్‌ కమిటీ సమావేశాలు నిర్వహిస్తానని, పార్టీ పరమైన అన్ని అంశాల్లోనూ సామాజిక న్యాయ సిద్ధాంతాన్ని పాటిద్దామని చెప్పారు. కాగా, మాణిక్యం అక్టోబర్‌ మొదటి వారంలో హైదరాబాద్‌కు రానున్నట్టు సమాచారం.   

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top