టీడీపీ లాయర్లే జడ్జిలు

Mithun Reddy And Vijaya Sai Reddy Comments On TDP In Lok Sabha - Sakshi

ఏపీలో శాసన వ్యవస్థలోకి న్యాయ వ్యవస్థ చొచ్చుకువస్తోంది

లోక్‌సభలో పీవీ మిథున్‌రెడ్డి ఘాటు వ్యాఖ్యలు

మా రాష్ట్రంలో నిష్పాక్షిక తీర్పులను ఆశించలేం.. కొలీజియం వ్యవస్థను తొలగించాలి

అమరావతి కుంభకోణం అని ప్రధానమంత్రే అన్నారు.. ఫైబర్‌ గ్రిడ్‌లో రూ.2 వేల కోట్ల అవినీతి

పార్లమెంట్‌ ఆవరణలో వైఎస్సార్‌సీపీ ఎంపీల ధర్నా 

భూముల కుంభకోణంపై సీబీఐ దర్యాప్తు చేయాలని డిమాండ్‌

అవినీతి నిరోధక చట్టం కింద ఏ కోర్టూ దర్యాప్తుపై స్టే ఇవ్వరాదు

ఇది ముమ్మాటికీ రాజ్యాంగ వ్యతిరేక చర్యే : విజయసాయిరెడ్డి

సాక్షి, న్యూఢిల్లీ, అమరావతి, సిటీ బ్యూరో: అమరావతిలో టీడీపీ ప్రభుత్వంలో జరిగిన భూ కుంభకోణాల కేసులో రాష్ట్ర హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై జాతీయ స్థాయిలో నిరసనలు, విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మాజీ అడ్వకేట్‌ జనరల్‌ దమ్మాలపాటి శ్రీనివాస్, సుప్రీంకోర్టు సిట్టింగ్‌ న్యాయమూర్తి ఇద్దరు కుమార్తెలతోపాటు 13 మంది అమరావతిలో అక్రమంగా భూములు కొనుగోలు చేయడంపై ఏసీబీ నమోదు చేసిన కేసు దర్యాప్తును రాష్ట్ర హైకోర్టు నిలిపివేయడం.. ఎఫ్‌ఐఆర్‌ను మీడియా ప్రచురించకూడదు/ ప్రసారం చేయకూడదని ఉత్తర్వులు ఇవ్వడాన్ని దేశ వ్యాప్తంగా రాజ్యాంగ నిపుణులు, న్యాయ కోవిదులు, రాజకీయ ప్రముఖులు తీవ్రంగా తప్పుబడుతున్నారు. టీడీపీ తరఫున వాదించిన లాయర్లే జడ్జిలయ్యారని వైఎస్సార్‌సీపీ లోక్‌సభాపక్ష నేత పీవీ మిథున్‌రెడ్డి లోక్‌సభలో ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాజధాని పేరుతో సాగిన అవినీతిని వెలికి తీస్తామనే నినాదంతోనే అధికారంలోకి వచ్చామని రాజ్యసభ సభ్యుడు వి.విజయసాయిరెడ్డి అన్నారు. ఈ అంశంపై వైఎస్సార్‌సీపీ ఎంపీలు పార్లమెంట్‌లో, వెలుపలా శుక్రవారం నిరసన వ్యక్తం చేశారు. హైకోర్టు ఇలాంటి తీర్పు ఇవ్వడమేంటని పలువురు ప్రముఖులు నిప్పులు చెరిగారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.
 శాసన వ్యవస్థ నిర్మాణం నాశనం అవుతోంది : మిథున్‌రెడ్డి 

► ఆంధ్రప్రదేశ్‌లో న్యాయ వ్యవస్థ శాసన వ్యవస్థలోకి చొచ్చుకు వస్తోంది. తద్వారా శాసన వ్యవస్థ నిర్మాణం నెమ్మది నెమ్మదిగా నాశనం అవుతోంది. మా రాష్ట్రంలో టీడీపీ తరఫున వాదించిన న్యాయవాదులు న్యాయమూర్తులయ్యారు. ఇలాంటప్పుడు మా రాష్ట్రంలో నిష్పాక్షికమైన తీర్పులు ఆశించలేం.  (చదవండి: భావ ప్రకటనకు సంకెళ్లా..?)

► న్యాయమూర్తుల ఎంపికలో న్యాయమైన చర్చ జరగాలి. ఈ తీర్పులు సక్రమంగా లేవు. న్యాయవ్యవస్థ, శాసన వ్యవస్థ మధ్య పలుచని రేఖ ఉంది. న్యాయ వ్యవస్థ శాసన వ్యవస్థ అధికారాల్లోకి చొరబడరాదు. దేశం ప్రగతి మార్గాన పయనించాలంటే మొత్తం కొలీజియం వ్యవస్థనే తొలగించాలి. దీనిపై పునరాలోచించాలి. 

► ఎన్డీయే వరసగా రెండు సార్లు అధికారంలోకి రావడానికి ప్రధాన కారణాలేంటంటే వాళ్లు అవినీతిని పెకిలించి వేస్తారని, వ్యవస్థలోకి వెళ్లిన అవినీతి సొమ్మును ఖజానాలో జమ చేస్తారని ప్రజలు నమ్మారు.
 
► సీబీడీటీ ఫిబ్రవరి 13న ఒక ప్రెస్‌ నోట్‌ జారీ చేసింది. దాని ప్రకారం.. ఆదాయ పన్ను శాఖ దాడుల్లో రూ.2 వేల కోట్ల మేర నల్లధనం వెలుగు చూసిందని చెప్పింది. ఈ దాడులు ఒక ప్రముఖుడి పర్సనల్‌ సెక్రటరీ వద్ద జరిగాయని ఆ ప్రెస్‌నోట్‌ వెల్లడించింది. ఆ ప్రముఖుడు ఎవరో కాదు.. మా రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి.  

► ప్రధాన మంత్రి మా రాష్ట్రానికి వచ్చినప్పుడు మాజీ ముఖ్యమంత్రి అమరావతిని ఒక కుంభకోణంగా మార్చారని అన్నారు. అవినీతికి ఏటీఎంలాగా మార్చారని వ్యాఖ్యానించారు. అమరావతి భూ కుంభకోణంపై సీబీఐ దర్యాప్తు జరగాలి. బీజేపీ ఏపీ యూనిట్‌ కూడా సీబీఐ దర్యాప్తు కోరింది. ఇక్కడ గొడవ చేస్తున్న టీడీపీ ఎంపీలు సీబీఐ దర్యాప్తు డిమాండ్‌కు మద్దతు ఇస్తారనుకుంటున్నా.   

సంకెళ్లు.. ఇప్పుడు హైకోర్టుల వంతు
ప్రజా ప్రయోజన సమాచార వ్యాప్తికి సంకెళ్లు వేయడం ఇప్పుడు హైకోర్టుల వంతైంది. ఇన్‌సైడర్‌ సమాచారంతో అమరావతిలో భూములు కొనుగోలు చేసిన వారికి వ్యతిరేకంగా నమోదైన ఫిర్యాదు ఇందుకు ఒక ఉదాహరణ. ఇప్పుడు ఏపీ హైకోర్టు ఈ కేసును మీడియా ప్రచురించరాదని, ప్రసారం చేయరాదని నిషేధం విధించింది. – సుబ్రమణియన్‌ స్వామి,న్యాయవాది, బీజేపీ ఎంపీ 

గత ప్రభుత్వ నిర్ణయాలను సమీక్షించే అధికారం ప్రభుత్వానికి ఉంది
ప్రొ.నాగేశ్వర్, మాజీ ఎమ్మెల్సీ, రాజ్యాంగ విశ్లేషకుడు 
‘గత ప్రభుత్వాల విధానాలను సమీక్షించకూడదని కోర్టులు అంటే ఎలా? విశృంఖల అధికారాలు ప్రభుత్వాలకే కాదు కోర్టులకు కూడా లేవు’ అని మాజీ ఎమ్మెల్సీ, రాజ్యాంగ విశ్లేషకుడు ప్రొ.నాగేశ్వర్‌ స్పష్టం చేశారు. మాజీ అడ్వకేట్‌ జనరల్, సుప్రీంకోర్టు న్యాయమూర్తి కుటుంబ సభ్యుల ప్రమేయం ఉందని చెబుతున్న కేసును దర్యాప్తు చేయొద్దని.. ఏసీబీ నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను మీడియా ప్రచురించొద్దని ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పు దురదృష్టకరమని, అది సరైందికాదని చెప్పారు. ఈ మేరకు ఓ టీవీ చానల్‌లో చర్చలో ఆయన మాట్లాడారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.  

► అసలు అవకతవకలు జరగలేదని హైకోర్టు ఎలా సర్టిఫికెట్‌ ఇస్తుంది? అవినీతి జరిగిందన్న ఆరోపణపై విచారణ జరుగుతోంది.  ఆరోపణలను కోర్టులు విచారణ స్థాయిలోనే అడ్డుకుంటామంటే ఎలా? విచారించకుండానే అది నిజం కాదని చెబుతున్నారా? 

► ఏపీలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం చట్టబద్ధంగానే ఏర్పడింది. అందువల్ల ఈ ప్రభుత్వానికి అంతకుముందు ప్రభుత్వాలు చేసిన వాటిని సమీక్షించే అధికారం ఉంటుంది. ఆ అధికారం ప్రజలే ఇచ్చారు. కాదనే అధికారం ఎవరికీ లేదు. 

► గత ప్రభుత్వాల నిర్ణయాలను సమీక్షించకూడదని చెప్పడానికి కోర్టులు ఎవరు? ప్రభుత్వం ఓ విధానాన్ని సమీక్షించాలా వద్దా.. విచారణ జరపాలా వద్దా అన్నది పరిపాలనా వ్యవస్థ నిర్ణయం. అసలు మీరు విచారణే జరపొద్దు అంటే ఎలా? 

► టీడీపీ ప్రభుత్వం ఏ తప్పూ చేయలేదని ఆ పార్టీ న్యాయవాదులు వాదించడంలో అర్థం ఉంది. కానీ టీడీపీ ప్రభుత్వం తప్పు చేయలేదు అంటూ విచారణ జరపొద్దని కోర్టు చెబుతుందా? ఇది విచిత్రం. 

► హైకోర్టు తీర్పు అనేక ప్రశ్నలకు కారణమవుతోంది. ప్రభుత్వాల పరిపాలనా అధికారంలోకి ప్రవేశించి కోర్టులు అనవసర జోక్యం చేసుకుంటున్నాయనే భావన బలపడుతోంది. ఇది కోర్టు గౌరవాన్ని ఇనుమడింపజేయదు. కోర్టులు ఎప్పుడూ ప్రజల హక్కుల గురించే పోరాడాలి తప్ప, రాజకీయపరమైన అంశాలలోకి వెళ్లకూడదు.  

► న్యాయ వ్యవస్థను ప్రశ్నించకూడదు.. విమర్శించకూడదు అని రాజ్యాంగంలో ఎక్కడా లేదు. ప్రశ్నించడం కోర్టు ధిక్కారం కూడా కాదు. ఇక ఎంపీలు పార్లమెంటు లోపల మాట్లాడిన అంశాలపై ఏ కోర్టు కూడా ప్రశ్నించడానికి లేదు. అది శాసన వ్యవస్థ రాజ్యాంగ బద్ధ అధికారం. కోర్టుల తీర్పులను ప్రశ్నిస్తూ పార్లమెంట్‌ కొత్త చట్టాలు చేసిన సందర్భాలు  ఎన్నో ఉన్నాయి.   

ఫైబర్‌ గ్రిడ్‌లో రూ. 2 వేల కోట్ల అవినీతి.. 
► ఏపీ ఫైబర్‌ గ్రిడ్‌లో ప్రజా సొమ్ము దుర్వినియోగమైంది. 10 లక్షల సెట్‌టాప్‌ బాక్సులు కొనుగోలు చేశారు. ప్రతి సెట్‌ టాప్‌ బాక్స్‌ను రూ.4,400కు కొనుగోలు చేశారు. నాలుగో తరగతి పిల్లాడు వెళ్లి షాపులో కొన్నా రూ.2 వేలలోపే కొనుగోలు చేయొచ్చు.  

► ఈ పది లక్షల సెట్‌ టాప్‌ బాక్స్‌ల్లో 2 లక్షల బాక్స్‌లు పని చేయడం లేదు. దీనిపై సీబీఐ దర్యాప్తు జరగాలని కేంద్రానికి లేఖ రాశాం. ఇందులో రూ.2 వేల కోట్లకు పైగా అవినీతి జరిగింది. రాజకీయ కక్షపూరిత ఆరోపణల ముద్ర లేకుండా మేం పారదర్శక, నిష్పాక్షిక విచారణ కోరుతున్నాం. అందుకే సీబీఐ దర్యాప్తు కోరుతున్నాం. (టీడీపీ ఎంపీలు అభ్యంతరం వ్యక్తం చేయడంతో ప్యానెల్‌ స్పీకర్‌ ఎన్‌.కె.ప్రేమ్‌చంద్రన్‌ జోక్యం చేసుకుంటూ.. ఎంక్వైరీ మీద మాట్లాడొచ్చు.. నో ప్రాబ్లెమ్‌.. అన్నారు..) 

భావ ప్రకటనా స్వేచ్ఛకు వ్యతిరేకం  
ఈరోజు పార్లమెంట్‌ సాక్షిగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలందరం నిరసన తెలియజేస్తున్నాం. అమరావతి భూ కుంభకోణం దర్యాప్తు ఆపాలని హైకోర్టు చెప్పడం దురదృష్టకరం. తెల్లరేషన్‌కార్డుదారులు రూ.కోట్లు వెచ్చించి భూములు ఎలా కొనుగోలు చేశారు? బినామీ యాక్ట్‌ దీనికి వర్తించదా? దేశంలో అతి పెద్ద స్కామ్‌ ఇది. ఇలాంటి స్కామ్‌ గురించి విచారణ జరగొద్దు.. దీని గురించి మీడియాలో రాయొద్దు అంటే ఎలా? ఇది భావ ప్రకటనా స్వేచ్ఛకు వ్యతిరేకం.    – మార్గాని భరత్, లోక్‌సభలో పార్టీ విప్‌ ఎంపీ 

ఇందులో పెద్ద పెద్ద వాళ్లు ఉన్నారనే.. 
చిన్న చిన్న కేసులు కూడా సీబీఐకి ఇస్తున్నారు. ఫోన్‌ టాపింగ్‌ అవుతోందని ఒక పత్రిక ప్రచురించిన కథనం ఆధారంగా, సాక్ష్యాధారాలు ఏవీ లేకున్నప్పటికీ, దానిపై కూడా దర్యాప్తునకు పూనుకున్నారు. అలాంటిది ఒక కేబినెట్‌ సబ్‌ కమిటీ ఏర్పాటై బినామీలకు సంబంధించిన ఆధారాలు సహా కోర్టుకు సమర్పిస్తే.. దర్యాప్తు ఆపమంటారా? పెద్ద పెద్దవాళ్ల పేర్లు ఇందులో వచ్చాయి. అందుకే సీబీఐ దర్యాప్తు జరగాలి.      – లావు శ్రీకృష్ణదేవరాయలు, ఎంపీ  

ప్లకార్డులతో ప్రదర్శన  
పార్లమెంట్‌ ఆవరణలో గాంధీ విగ్రహం వద్ద వైఎస్సార్‌ సీపీ ఎంపీలు ధర్నా నిర్వహిస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. అమరావతి భూ కుంభకోణంపై, ఏపీ ఫైబర్‌నెట్‌పై, అంతర్వేది ఆలయంలో రథం దగ్ధం ఘటనపై సీబీఐ దర్యాప్తు జరపాలని కోరారు. కేంద్రం జోక్యం చేసుకోవాలంటూ నినాదాలు చేశారు. ఈ ఆందోళనలో ఎంపీలు విజయసాయిరెడ్డి, మిథున్‌రెడ్డి, సురేష్, భరత్, శ్రీనివాసుల రెడ్డి, అయోధ్య రామిరెడ్డి, బోస్, మోపిదేవి, పోచ బ్రహ్మానందరెడ్డి, కోటగిరి శ్రీధర్, లావు శ్రీకృష్ణదేవరాయలు, మాధవ్, ఎంవీవీ సత్యనారాయణ, బెల్లాన చంద్రశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు. 

పార్లమెంట్‌ ఆవరణలో మీడియాతో మాట్లాడుతున్న వైఎస్సార్‌ సీపీ ఎంపీలు  

జైట్లీ మాటలు నిజమయ్యాయి.. 
► 2016లో ఆర్థిక బిల్లును ప్రవేశపెడుతూ కేంద్ర ఆర్థిక మంత్రి ‘న్యాయ వ్యవస్థ శాసన వ్యవస్థలోకి చొచ్చుకువస్తోంది.. క్రమక్రమంగా ఇటుకపై ఇటుక పేర్చినట్టుగా.. భారత శాసన వ్యవస్థ స్వరూపం నాశనమైపోతోంది’ అని అన్నారు.  

► సరిగ్గా అరుణ్‌జైట్లీ చెప్పిన రీతిలోనే ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతోంది. స్పెషల్‌ ఇన్వెస్టిగేషన్‌ టీమ్‌ (సిట్‌) దర్యాప్తును ఏపీ హైకోర్టు నిలిపివేసింది. సమాచార ప్రచురణను, ప్రసారాన్ని నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఎందుకంటే మాజీ అడ్వొకేట్‌ జనరల్‌ పేరు, ఓ న్యాయమూర్తి కుటుంబ సభ్యుల పేర్లు ఎఫ్‌ఐఆర్‌లో ఉన్నందునే ఇలా జరిగింది. ఇది మంచిది కాదు.  

► ఈ అంశాలను కేంద్రం పరిగణనలోకి తీసుకోవాలి. కేంద్రం రాష్ట్రాల ప్రయోజనాలు కాపాడాలి.  

రాజ్యాంగ వ్యతిరేక చర్య : ధర్నాలో వి.విజయసాయిరెడ్డి  
► సమాచార నిషేధ ఉత్తర్వు రాజ్యాంగ వ్యతిరేక చర్య. ఆర్టికల్‌ 14ను ఉల్లంఘించే చర్య. ఈ కేసులో అసలు నిజంగా స్టే ఇచ్చే అధికారం హైకోర్టుకు ఉందా అన్న అంశాన్ని పరిశీలించాలి. దీనికంటే ముందు కొన్ని వివరాలు మీకు (మీడియా) చెబుతా.  

► మూడు అంశాల ప్రాతిపదికగా మా పార్టీ అధికారంలోకి వచ్చింది. ఒకటి రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని ఉద్యమించాం. ఈ రోజుకు కూడా దానికి కట్టుబడి ఉన్నాం. రెండోది.. పేదలు, బడుగు బలహీన వర్గాల ప్రజల ప్రయోజనాలు కాపాడుతామని చెప్పాం. అందుకోసమే మా పార్టీ  పుట్టింది. మూడోది.. గత ప్రభుత్వంలో ఏవైతే లక్షల కోట్ల రూపాయల స్కామ్స్‌ జరిగాయో.. ఆ ప్రజా సొమ్మును చంద్రబాబునాయుడు, ఆయన కొడుకు ఏ విధంగా దోచుకున్నాడో దానిని రికవరీ చేసి తిరిగి ఖజానాకు జమ కట్టాలన్న అంశాల ప్రాతిపదికగా వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వచ్చింది.  

► ఏపీ హైకోర్టు పోలీసుల దర్యాప్తుపై స్టే ఇచ్చింది. సమాచార నిషేధ ఉత్తర్వులను జారీ చేసింది. ఈ రెండు ఎంతవరకు చట్టబద్ధంగా జారీ చేశారు? హైకోర్టుకు నిజంగా ఆ అధికారం ఉందా? అన్న అంశాలను పరిశీలించాలి. ఇదొక రాజ్యాంగ వ్యతిరేక చర్య. ఆర్టికల్‌ 14ను ఉల్లంఘించే చర్య. హైకోర్టుకు ఈ అధికారం లేదు. ఇది ప్రజాస్వామ్యానికి  ప్రమాదకరం.  

► ఈ కేసును అవినీతి నిరోధక చట్టంలోని 13వ సెక్షన్‌ ప్రకారం నమోదు చేశారు. ఇదే చట్టంలోని సెక్షన్‌ 19 (3) క్లాజ్‌ ‘సి’ ప్రకారం.. ఏ కోర్టు కూడా, ఏ ఇతర ప్రాతిపదికపై కూడా, ప్రొసీడింగ్స్‌పై స్టే ఇవ్వరాదు.  ఏదైనా ఎంక్వైరీ ట్రయల్, అప్పీలు లేదా ప్రొసీడింగ్స్‌కు సంబంధించిన మధ్యంతర ఉత్తర్వులను రివిజన్‌ చేసేందుకు ఏ కోర్టుకు అధికారం లేదు. చట్టంలో ఇంత స్పష్టంగా ఉన్నప్పుడు ఎలా స్టే ఇచ్చారన్నదే ప్రశ్న. కొన్ని ప్రత్యేక, అత్యవసర పరిస్థితుల్లో స్టే ఇవ్వచ్చని నిన్ననే చెప్పాను. నిజంగా అలాంటి పరిస్థితులు ఉన్నాయా? అవి ఈ కేసుకు అన్వయించవచ్చా? పోలీస్‌ మీద నమ్మకం లేకపోతే దర్యాప్తును సీబీఐకి ఇవ్వొచ్చు కదా?.   

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top