'ఆ మ్య‌చ్‌ ఓట‌మి జీర్ణించుకోలేక‌పోతున్నా'

Imran Tahir Recalls IPL 2019 Final Match In Insta Livechat - Sakshi

2019 ఐపీఎల్‌లో ముంబై ఇండియ‌న్స్, చెన్నై సూప‌ర్ కింగ్స్ మ‌ధ్య జ‌రిగిన‌ ఫైన‌ల్ మ్యాచ్‌ను వ‌న్ ఆఫ్ ది బెస్ట్ థ్రిల్లింగ్ మ్యాచ్ అన‌డంలో సందేహం లేదు. ఐపీఎల్ చ‌రిత్ర‌లోనే ప్రేక్ష‌కుల‌ను మునివేళ్ల‌పై నిల‌బెట్టిన మ్యాచ్ ఇది. ఎందుకంటే ఇరు జ‌ట్ల మ‌ధ్య ఆఖ‌రి బంతి వ‌ర‌కు విజ‌యం దోబుచులాడిన‌ చివ‌ర‌కు ఒక్క ప‌రుగు తేడాతో చెన్నై ఓడిపోవ‌డంతో ఆ జ‌ట్టు అభిమానుల గుండెలు బ‌రువెక్కిపోయాయి. మొద‌ట బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియ‌న్స్ 20 ఓవ‌ర్ల‌లో 8 వికెట్లు కోల్పోయి 149 ప‌రుగులు చేసింది. ఆల్‌రౌండ‌ర్ కీర‌న్ పొలార్డ్ 25 బంతుల్లో 41 ప‌రుగులు చేయ‌డంతో ఆ మాత్రం స్కోరైనా వ‌చ్చింది.

బ‌ల‌మైన బ్యాటింగ్ లైన‌ఫ్ క‌లిగిన చెన్నై సూప‌ర్‌కింగ్స్‌కు ఈ టార్గెట్ పెద్ద క‌ష్ట‌మని ఎంత మాత్రం అనిపించ‌లేదు, అందుకు త‌గ్గ‌ట్టుగానే ఓపెన‌ర్ షేన్ వాట్స‌న్ 59 బంతుల్లోనే 80 ప‌రుగులు చేయ‌డంతో సూప‌ర్ కింగ్స్ విజ‌యానికి చేరువ‌గా వ‌చ్చింది.  అయితే చివ‌ర్లో నాట‌కీయ ప‌రిణామాలు చోటుచేసుకోవ‌డంతో వ‌రుస విరామాల్లో వికెట్ల‌ను కోల్పోయింది. దీనికి తోడు స్టార్ బౌల‌ర్ ల‌సిత్ మ‌లింగ ఆఖ‌రి ఓవ‌ర్లో చేసిన మ్యాజిక్‌తో చెన్నై విజ‌యానికి ఒక్క ప‌రుగు దూరంలో ఆగిపోయి ఓడిపోవాల్సి వ‌చ్చింది.దీంతో ముంబై ఇండియ‌న్స్ నాలుగోసారి ఐపీఎల్ టైటిల్‌ను చేజెక్కించుకుంది. తాజాగా అప్ప‌టి ఫైన‌ల్‌లో ఓడిపోయిన‌ చెన్నై జ‌ట్టులో స‌భ్యుడిగా ఉన్న దక్షిణాఫ్రికా స్పిన్న‌ర్ ఇమ్రాన్ తాహిర్ మ‌రోసారి ఆ మ్యాచ్‌ను గుర్తుచేసుకున్నాడు. అనిస్ సాజ‌న్ నిర్వ‌హించిన ఇన్‌స్టా లైవ్ చాట్‌లో పాల్గొన్న తాహిర్ ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాలు చెప్పుకొచ్చాడు.

'ఆ ఫైన‌ల్ మ్యాచ్‌లో కేవ‌లం ఒక్క ప‌రుగుతో ఓడిపోవ‌డం నా గుండెను బ‌ద్ద‌లయ్యేలా చేసింది. ఎందుకంటే లీగ్‌లో మేము అప్ప‌టి వ‌ర‌కు ఆడిన అన్ని మ్యాచుల్లో గెలుచుకుంటే వ‌చ్చాం. అందులో పెద్ద టీమ్స్ కూడా ఉన్నాయి... వాటిని కూడా రెండేసి సార్లు ఓడించాం. ఆరు నుంచి ఎనిమిది వారాల పాటు జ‌ట్టుతో జ‌ర్నీ చేసిన నేను ఫైన‌ల్లో కేవ‌లం ఒక్క‌పరుగుతో ఓడిపోవ‌డం జీర్ణించుకోలేక‌పోయా. మాకు టైటిల్ దూరం కావ‌డానికి ఒక్క ప‌రుగే తేడా.. కానీ ఆ ఒక్క ప‌రుగే మ‌మ్మ‌ల్ని టైటిల్‌కు దూరం చేసింది. మేం క‌ష్ట‌ప‌డ్డాం.. గెలుపుకోసం ప్ర‌య‌త్నించాం.అయినా గెలుపోట‌ములు అనేది మ‌న చేతిలో ఉండ‌వు.(తండ్రైన హార్దిక్‌ పాండ్యా..)

నిజానికి ఆ మ్యాచ్ ఈజీగా గెల‌వాల్సింది..వాట్స‌న్ మంచి ఆరంభాన్నిచ్చాడు. శార్థుల్ ఠాకూర్ సిక్స‌ర్ల‌తో రెచ్చిపోయాడు. కానీ ల‌సిత్ మ‌లింగ రూపంలో దుర‌దృష్టం మ‌మ‌ల్ని వెంటాడింది. మ‌లింగ ఆరోజు ఆఖ‌రి ఓవ‌ర్‌లో అద్భుతంగా బౌలింగ్ చేశాడు. ఒత్తిడిని త‌ట్టుకొని మ‌రీ బౌలింగ్ చేసి కేవ‌లం ఒక్క ప‌రుగుతో ముంబైకి టైటిల్ క‌ట్ట‌బెట్టాడు. నిజంగా ప్ర‌పంచంలో మ‌లింగ  అత్యుత్త‌మ బౌల‌ర్ అన‌డంలో సందేహం లేదు. కానీ ఏం చేస్తాం.. మాది కాని రోజు ఇలాగే ఉంటుంది అని ఆ క్ష‌ణంలో నాకు అనిపించింది' అంటూ పేర్కొన్నాడు.కాగా క‌రోనాతో వాయిదా ప‌డిన ఐపీఎల్ 13 వ సీజ‌న్ దుబాయ్ వేదిక‌గా సెప్టెంబ‌ర్ 19 మొద‌లుకానుంది. 51 రోజులు పాటు జ‌గ‌రునున్న ఐపీఎల్ 13 సీజ‌న్ ఫైన‌ల్ మ్యాచ్ న‌వంబ‌ర్ 8న జ‌ర‌గ‌నుంది. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top