తేనె పూసిన కత్తి : సీఎం కేసీఆర్‌

KCR Fires On BJP Over New Agriculture Bill - Sakshi

కేంద్ర వ్యవసాయ బిల్లుపై సీఎం కేసీఆర్‌ మండిపాటు

రైతులు రవాణా ఖర్చులు భరించి వేరే చోటుకు తీసుకెళ్లి అమ్మడం సాధ్యమేనా? 

 బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయాలని పార్టీ ఎంపీలకు ఆదేశం 

సాక్షి, హైదరాబాద్‌: ‘కేంద్రం ప్రవేశపెట్టిన వ్యవ సాయ బిల్లు తేనె పూసిన కత్తి లాంటి చట్టం. రైతు లోకానికి తీవ్ర అన్యాయం చేసే విధంగా ఉంది’ అని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు తీవ్రంగా మండిపడ్డారు. రైతులను దెబ్బ తీసి కార్పొరేటు వ్యాపారులకు లాభం చేకూర్చే విధంగా ఉన్న ఈ బిల్లును గట్టిగా వ్యతిరేకించాలని టీఆర్‌ఎస్‌ పార్లమెంటరీ పార్టీ నాయకుడు కె.కేశవరావును ఆదేశించారు. టీఆర్‌ఎస్‌ ఎంపీలతో ఫోన్‌లో మాట్లాడిన కేసీఆర్‌ ఆదివారం రాజ్యసభలో వ్యవసాయ బిల్లులను ప్రవేశపెడుతున్న సందర్భంలో వీటిని తీవ్రంగా వ్యతిరేకించాల్సిన అవసరాన్ని వారికి వివరించారు. ‘ రైతులు తమ సరుకును దేశంలో ఎక్కడైనా అమ్ముకోవచ్చని అంటున్నారు. నిజానికి రైతులు తమకున్న కొద్దిపాటి సరుకును ఎన్నో రవాణా ఖర్చులు భరించి లారీల ద్వారా వేరే చోటుకు తీసుకెళ్లి అమ్మడం సాధ్యమేనా ? ఇది తేనె పూసిన కత్తిలాంటి చట్టం. దీన్ని ఖచ్చితంగా వ్యతిరేకించి తీరాలి’అని సీఎం చెప్పారు. 

మక్కలపై దిగుమతి సుంకం తగ్గింపు ఎవరికోసం?
‘ప్రస్తుతం మక్కల దిగుమతిపై 50 శాతం సుంకం అమలులో ఉంది. దీనిని 15 శాతానికి తగ్గించి కోటి టన్నుల మక్కలు దిగుమతి చేసుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటికే 70–75 లక్షల టన్నులను కొనుగోలు చేసింది. 35 శాతం సుంకం తగ్గించడం ఎవరి ప్రయోజనం ఆశించి చేసింది. దేశం ఆర్థిక సంక్షోభంలో ఉన్న సమయంలో ఈ నిర్ణయం ఎలా తీసుకున్నారు. మన దేశంలోనే పుష్కలంగా మక్కలు పండుతున్నాయి. సుంకం తగ్గించి మరీ మక్కలు దిగుమతి చేస్తుంటే మన దేశ రైతుల పరిస్థితి ఏమిటి?’అని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. కేంద్రం తీసుకొచ్చిన బిల్లు వ్యవసాయ రంగానికి తీవ్ర నష్టం కలిగించే విధంగా, రైతుల ప్రయోజనాలను దెబ్బ తీసే విధంగా ఉంది కాబట్టి రాజ్యసభలో గట్టిగా వ్యతిరేకించాలని సీఎం చెప్పారు. రాజ్యసభలో ఈ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయాలని టీఆర్‌ఎస్‌ ఎంపీలను ఆదేశించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top